బౌద్ధ మినీ స్తూపంతో కూడిన పార్కు దుస్థితి
హైదరాబాద్‌కు చెందిన శ్యాంప్రసాద్ అనే యువకుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన యువతిని వివాహమాడాడు. నేలకొండపల్లిలో ఘన చరిత్రగల బౌద్ధ స్తూపం ఉందని తెలుసుకొని ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. అయితే స్తూపాన్ని, అక్కడి పరిసరాల పరిస్థితిని చూసి తీవ్ర నిరాశ చెందాడు. తన ఆవేదనను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లగా ఆయన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రీట్వీట్ చేశారు. అయితే ఈ ఆవేదన నేలకొండపల్లి అల్లుడిది మాత్రమే కాదని ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
సాక్షి, ఖమ్మం డెస్క్: దక్షిణాదిలోకెల్లా అతిపెద్ద బౌద్ధక్షేత్రం.. సుమారు 106 అడుగులు వ్యాసార్థం, 60 అడుగుల ఎత్తు.. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినదిగా ఘనత.. 46 ఏళ్ల క్రితం తవ్వకాల్లో గుర్తింపు.. ఇటువంటి ప్రత్యేకతలున్న ఆ క్షేత్రాన్ని కుటుంబంతో సహా కలసి వెళ్లి చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోరిక నెరవేరాలంటే మీరు ఎంతో కష్టపడాల్సిందే.. ఎందుకంటారా? ఆ స్తూపం వద్దకు వెళ్లేందుకు కనీస రవాణా సౌకర్యం లేకపోగా ఎలాగోలా వెళ్లినా తాగడానికి నీళ్లు, కూర్చోవడానికి నీడ లేక అల్లాడాల్సిందే..!
ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కి.మీ. దూరంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో నేలకొండపల్లి–ముజ్జుగూడెం గ్రామాల మధ్యన ఈశాన్య దిక్కున ఉన్న బౌద్ధక్షేత్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నాలుగు బెంచీలు తప్ప తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివేవీ కనిపించవు. ప్రధాన ద్వారం వద్ద స్థూపం వివరాలతో కూడిన బోర్డు ఉన్నా దానిపై అక్షరాలు చెరిగిపోయి అది కూడా చెదిరిపోయిన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఒక అడుగు ముందుకు పడినా...
నేలకొండపల్లి సమీపంలోని బౌద్ధస్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ. 1.26 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కంచె, పార్కు ఏర్పాటు చేశారు. అలాగే పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షలతో స్తూపం అభివృద్ధి చేపట్టారు. అసలైన బౌద్ధ స్థూపం చాలా ఎత్తుగా ఉండటంతో బౌద్ధ స్థూపాన్ని పోలిన మినీ స్తూపంతోపాటు చిన్న పార్కును, అందులో పిల్లలను ఆకర్షించేందుకు జంతువుల సిమెంట్ బొమ్మలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో పార్కులో మొక్కలు పోయి పిచ్చిచెట్లు పెరిగి ఆ పరిసరాలు చిట్టడివిని తలపిస్తున్నాయి.
కేటీఆర్‌కు శ్యాంప్రసాద్ చేసిన ట్వీట్
బోటింగ్ ఏదీ?
బౌద్ధక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న బాలసముద్రం చెరువులో పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క చర్య కూడా అధికారులు చేపట్టలేదు.
బౌద్ధస్తూపం.. మరికొన్ని సంగతులు
►బౌద్ధస్తూపం ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం స్థానికులు ఎర్రదిబ్బగా పిలిచేవారు.
►క్రీస్తుశకం రెండో శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని నెల్‌సిండా అని పేర్కొన్నట్లు చెబుతారు. ఆ ప్రాంతమే వ్యవహారంలో నేలకొండపల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం.
►నేలకొండపల్లి పరిసరాల్లో క్రీ.శ. 6వ శతాబ్దం వరకు బౌద్ధం విరాజిల్లినట్లు భావిస్తున్నారు.
►1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా, రెండో దఫా 1984లో చేపట్టిన తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్ముయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణాలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ మ్యూజియాల్లో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment