కొలంబో : శ్రీలంకలో నిర్వహించిన పెరెహర ఉత్సవాల్లో 70 ఏళ్ల వృద్ధ ఏనుగును కవాతుకు ఉపయోగించడం అందరి మనసులను కలచి వేస్తోంది. ఎసాలా పెరెహారా వార్షిక పోటీల్లో అనారోగ్యంతో ఉన్న ముసలి ఏనుగును అధికారులు కవాతుకు ప్రోత్సహించారు. దీంతో ఆ ఏనుగు అనారోగ్యంతో కుప్పకూలిపోయింది. దీనిపై జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో స్పందించిన శ్రీలంక ప్రభుత్వం ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. టెంపుల్ ఆఫ్ ది టూత్.. పవిత్రమైన బౌద్ధమత పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం సాంప్రదాయ నృత్యాలతో పాటు దాదాపు 100 ఏనుగులతో వార్షిక పండుగను నిర్వహిస్తారు. కాండీలో జరిగిన పెరెహర ఉత్సవాలలో వృద్ధ ఏనుగుతో కవాతు చేయించటంపై ‘సేవ్ ఎలిఫింట్ ఫౌండేషన్’ వారు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించే యాజమాన్యం సదరు ఏనుగును బుధవారం జరిగిన తుది పోటీల నుంచి తప్పించారు.
ఈ ఘటనపై స్పందించిన పర్యాటక, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి జాన్ అమరతుంగా.. తికిరి అనే ముసలి ఏనుగు ఆరోగ్యం బాలేకపోయినా కవాతు చేయడానికి ఎలా ఉపయోగించారని వన్యప్రాణి అధికారులను ప్రశ్నించారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఏనుగును ఉపయోగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక అక్కడ ఉన్న మిగతా 200 ఏనుగులకు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని వన్యప్రాణి అధికారులను హెచ్చరించారు. బౌద్ధ దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులతో సాధారణంగా కవాతు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా ఇలాంటి పోటీల్లో ఏనుగులను అమానవీయంగా చూస్తున్నారని, తికారా చావుకు దగ్గరగా ఉందని ఏనుగుల నిపుణుడు జయంతా జయవర్ధనే పేర్కొన్నారు. కవాతులో వృద్ధ ఏనుగును భారీ దుస్తులతో కప్పి ఉంచినందున అది ఎంత బలహీనంగా ఉందో గమనించలేకపోయారని అవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment