15 నిమిషాల పాటు ఒళ్లో కూర్చుని.. | Cat Tests Buddhist Monk Patience Thailand Video Goes Viral | Sakshi
Sakshi News home page

బౌద్ధ సన్యాసి సహనాన్ని పరీక్షించిన పిల్లి!

Published Mon, Jan 6 2020 11:27 AM | Last Updated on Mon, Jan 6 2020 2:46 PM

Cat Tests Buddhist Monk Patience Thailand Video Goes Viral - Sakshi

బ్యాంకాక్‌: నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు చేస్తున్న ఓ బౌద్ధ సన్యాసి సహనాన్ని పిల్లి పరీక్షించింది. ప్రార్థనలో మునిగి ఉన్న ఆయనపైకి ఎక్కి.. పావుగంట సేపు నిమిరి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా థాయ్‌లాండ్‌లో దాదాపు 95 శాతం మంది ప్రజలు బౌద్ధ మతవిశ్వాసాన్ని ఆచరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020కి స్వాగతం పలుకుతూ వాట్‌ ఉడోమ్రాంగ్సీ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు బౌద్ధ సన్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 25 ఏళ్ల బౌద్ధ సన్యాసి ఒళ్లోకి చేరిన పిల్లి.. పదే పదే ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించింది. సున్నితంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా.. ఏమాత్రం కదలకుండా ఆయన శరీరాన్ని నిమురుతూ అక్కడే ఉండిపోయింది. ఈ విషయం గురించి సదరు సన్యాసి మాట్లాడుతూ.. ‘నేను పుస్తకం చదివేందుకు ప్రయత్నిస్తుంటే.. పిల్లి మాత్రం నా శ్రద్ధను తన వైపునకు తిప్పుకుంది’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ‘సాటి జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే బౌద్ధ సూక్తిని సన్యాసి ఆచరించి చూపించారంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా థాయ్‌లాండ్‌ బౌద్ధాలయాల్లో పిల్లులను స్వేచ్ఛగా తిరుగనిచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ఈ ఘటన జరిగిన వాట్‌ ఉడోమ్రాంగ్సీ ఆలయంలో దాదాపు 12 పిల్లులు ఉన్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు వీటికి ఆహారం తినిపించడం ఇక్కడ పరిపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement