జోరుగా గుంటూరు మిర్చి ఎగుమతులు..కోల్డ్‌ స్టోరేజీలు ఖాళీ | Guntur Pepper Exports Are Booming | Sakshi
Sakshi News home page

జోరుగా గుంటూరు మిర్చి ఎగుమతులు..కోల్డ్‌ స్టోరేజీలు ఖాళీ

Oct 23 2022 8:31 AM | Updated on Oct 23 2022 8:36 AM

Guntur Pepper Exports Are Booming - Sakshi

(బీవీ రాఘవరెడ్డి)

కోవిడ్, బ్లాక్‌ థ్రిప్స్‌ తెగులు లాంటి అవరోధాలు ఎదురైనా గుంటూరు మిరప ఘాటు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లతో ఇప్పటికే కోల్డ్‌ స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా ఏటా కనీసం 30 శాతం మిర్చి తర్వాత సీజన్‌ వరకు నిల్వ ఉంటుంది. కోల్డ్‌ స్టోరేజీల్లో మొత్తం నిల్వలు ముందుగానే ఖాళీ కావటం ఇటీవల ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 2–3 ఏళ్లుగా ఎండుమిర్చి ధరలు బాగున్నాయి. క్వింటాల్‌ రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. క్వింటాల్‌కు రూ.8 వేల కంటే అధిక ధర లభిస్తే రైతన్నకు లాభాలు దక్కుతాయి. గత రెండేళ్లలో దాదాపు 40 శాతం మిరప తోటలు బ్లాక్‌ థ్రిప్స్‌ బారిన పడినప్పటికీ మిగిలిన పంటకు మంచి ధర రావటంతో రైతులు అప్పుల పాలు కాకుండా గట్టెక్కారు.

వచ్చే సీజన్‌లోనూ డిమాండ్‌..
దేశవ్యాప్తంగా మిర్చి ఉత్పత్తి తగ్గుతుండగా డిమాండ్‌ మాత్రం భారీగా ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ ముగిసి హోటళ్లు తిరిగి ప్రారంభం కావటంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మిర్చికి గిరాకీ పెరిగింది. ఇప్పటికే క్వింటాల్‌ మిర్చి రూ.15,000–30,000 పలుకుతోంది. గత రెండు సీజన్లలో తేజ, బాడిగ రకం గరిష్టంగా రూ.30 వేలు ధర పలికాయి. మిర్చి పండించే కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా ప్రస్తుత సీజన్‌లో పంట విస్తీర్ణం 15–20 శాతం తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల ఆలస్యంగా విత్తడంతో పాటు వివిధ కారణాల వల్ల పంట రాక కనీసం 45–60 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రానున్న డిసెంబర్‌ సీజన్‌లో ఎగుమతులతో పాటు ధరలు 30 – 40 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

స్పైసెస్‌ పార్కుతో ఎగుమతులకు ఊపు
గుంటూరు శివార్లలో ఏర్పాటైన స్పైసెస్‌ పార్కు గత మూడేళ్లుగా మిర్చి ఎగుమతులు పెరిగేందుకు ఎంతో దోహదం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ, స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో మైదవోలు–వంకాయలపాడు పరిధిలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను నెలకొల్పాలని 2007లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో స్పైసెస్‌ పార్కు మంజూరైంది. దేశవ్యాప్తంగా 60 శాతం మిరప పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్నందున పార్కు కోసం ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేశారు. వెంటనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించారు.

మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వెచ్చించాయి. ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 12 ఎకరాల్లో 23 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో నాలుగు గోడౌన్లను నిర్మించింది. వీటికి 200 కేవీఏ సామర్థ్యం గల రెండు సోలార్‌ యూనిట్ల ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పార్కు స్థలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు బోర్డు లీజుకు ఇస్తోంది. ఈ మేరకు 58 ప్లాట్లను సిద్ధం చేయగా 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. ఐటీసీతో సహా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న పలు ప్రముఖ సంస్థలు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో సొంత ప్రాసెసింగ్‌ యూనిట్లను నిర్మిస్తున్నాయి. 

ఉత్తమ విధానాలపై శిక్షణ..
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు కోసం స్పైసెస్‌ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఉత్పత్తులను శుభ్రపరచడం, గ్రేడింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్, నిల్వ చేసేందుకు గోడౌన్లు ఉంటాయి. పవర్‌ స్టేషన్లు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు, వేయింగ్‌ బ్రిడ్జిలు, ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, నాణ్యతా నిర్ధారణకు ల్యాబ్, బ్యాంక్, పోస్ట్‌ ఆఫీస్‌ కౌంటర్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు, గెస్ట్‌హౌస్‌ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. స్పైసెస్‌ పార్కు తరఫున రైతులు, వ్యాపారులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, అధునాతన ప్రాసెసింగ్‌ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించటం ద్వారా రైతులకు మంచి ధర అందించేలా తోడ్పాటు అందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు పార్కులో అందుబాటులో ఉన్న సాధారణ ప్రాసెసింగ్‌ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. 
తద్వారా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించవచ్చు.

మూడేళ్లుగా మంచి ధరలు 
12 ఎకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేస్తున్నా. గత మూడేళ్లుగా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎకరాకు 30–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత ఏడాది నల్ల పేను (బ్లాక్‌ థ్రిప్స్‌) తెగులు కారణంగా 15–20 క్వింటాళ్లకు మించలేదు. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. డిసెంబరు చివరలో మొదటి కోత వస్తుంది. జనవరి చివరికి మూడు కోతలు పూర్తవుతాయి. ఈసారి దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లకు తగ్గదని భావిస్తున్నా. 
– బొడ్లపాటి రామిరెడ్డి, రైతు, చేజర్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా

ఆరోగ్యానికి మంచిదే 
ఔషధ గుణాలను కలిగి ఉండే మిర్చిని మితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
ప్రపంచంలో 400 రకాలకు పైగా మిరపకాయలున్నాయి. 
ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 16 శాతం మిరప కాయలున్నాయి. 
 మిర్చి ఉత్పత్తిలో భారత్‌ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. 
ఘాటైన మిరప రకం గుంటూరు సన్నం–ఎస్‌4 
విదేశాలకు ఎగుమతి అయ్యే మిరపలో దాదాపు 30 శాతం వాటా గుంటూరు మిర్చిదే. + ఇక్కడ పండే కాయ నాణ్యత బాగుండటంతో అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement