తెనాలి: అతడో సాధారణ ముఠా కార్మికుడు. లారీ ఎప్పుడొస్తే అప్పుడు బస్తాలు దించటం.. లారీలోకి ఎత్తడమే అతడి పని. కానీ.. నిరంతరం చరిత్ర అన్వేషణలో మునిగి తేలుతుంటాడు. శాసనాలను శోధిస్తుంటాడు. సారాన్ని క్రోడీకరిస్తాడు. గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటివరకు 500 అదృశ్య గ్రామాల చరిత్రను ఆయన వెలికితీశారు. డిగ్రీలు లేకపోయినా పరిశోధకుడుగా చరిత్రకారుల సరసన నిలిచారు.
అతడి పేరు మణిమేల శివశంకర్. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి స్వగ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన శివశంకర్ అయిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. జీవనోపాధి కోసం ముఠా కార్మికుడిగా గుంటూరులో స్థిరపడ్డారు. దైవదర్శనం కోసం ఆలయాలకు వెళుతున్నపుడు ఆలయ చరిత్రను తెలుసుకుంటూ.. అక్కడ శాసనాలుంటే వాటిని ఆరా తీసే క్రమంలో శివశంకర్‌కు చరిత్రపై ఆసక్తి ఏర్పడింది. క్రమేపీ అదే హాబీగా మారింది. తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలు చదవటం, కొత్త శాసనాలను సేకరించటం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అధ్యయనంలో పాత తెలుగు శాసనాలను చదవటం సాధించారు. సంస్కృతంలో ఉన్న శాసనాలకు తెలిసిన వారిపై ఆధారపడుతున్నారు.
శివశంకర్ గుంటూరు జిల్లాలోని ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు కాలినడకన వెళ్లారు. అందుబాటులో ఉన్న స్థానిక రికార్డుల్ని తిరగేసి.. కల్నల్ మెకంజీ రాతల్ని తడిమి చూశారు. సమీప గ్రామాల్లోని పెద్దల్ని పలకరించారు. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను ‘గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు’ పేరుతో గ్రంథస్థం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామం పింగళి గురించి రచయిత ఇచ్చిన వివరణ చరిత్రకారులను ఆకట్టుకుంది.
పింగళి అనగానే ఆధునిక సినీకవి పింగళి నాగేంద్రరావు, మధ్యయుగంలో అష్టదిగ్గజాల్లో ప్రముఖుడు, ‘కళాపూర్ణోదయం’ సృష్టికర్త పింగళి సూరనకవి, కాకునూరి అప్పకవీంద్రుల పుట్టుపూర్వోత్తరాలను తిరగదోడటం ద్వారా శివశంకర్, సాహిత్యంపై తనకు గల మమతానురాగాన్ని బహిర్గతం చేశారు. రెంటాల బ్రహ్మీ శాసనంలో ప్రస్తావించిన ‘నిడిగల్లు’ గ్రామం, క్రీ.శ 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకు రాజధానిగా నాగార్జునుని కోట విజయపురిలో ఉన్నదనే ఆధారం ఇచ్చారు. దుర్గి మండలంలోని అదృశ్య గ్రామం ‘దద్దనాలపాడు’ ఒకప్పుడు రాజ స్త్రీల సతీసహగమనం జరిగిన ప్రదేశమట. తెనాలి రామలింగకవి స్వస్థలం గార్లపాడు తెనాలి మండల గ్రామం కొలకలూరుకు సమీపంలోని అదృశ్య గ్రామమని తేల్చారు శివశంకర్. అదృశ్య గ్రామ చరిత్రలను అందించిన శివశంకర్‌ను ‘అయ్యంకి–వెలగా పురస్కారం’ వరించింది.
Comments
Please login to add a commentAdd a comment