villages story
-
ఏపీ: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి..
తెనాలి: అతడో సాధారణ ముఠా కార్మికుడు. లారీ ఎప్పుడొస్తే అప్పుడు బస్తాలు దించటం.. లారీలోకి ఎత్తడమే అతడి పని. కానీ.. నిరంతరం చరిత్ర అన్వేషణలో మునిగి తేలుతుంటాడు. శాసనాలను శోధిస్తుంటాడు. సారాన్ని క్రోడీకరిస్తాడు. గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటివరకు 500 అదృశ్య గ్రామాల చరిత్రను ఆయన వెలికితీశారు. డిగ్రీలు లేకపోయినా పరిశోధకుడుగా చరిత్రకారుల సరసన నిలిచారు. అతడి పేరు మణిమేల శివశంకర్. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి స్వగ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన శివశంకర్ అయిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. జీవనోపాధి కోసం ముఠా కార్మికుడిగా గుంటూరులో స్థిరపడ్డారు. దైవదర్శనం కోసం ఆలయాలకు వెళుతున్నపుడు ఆలయ చరిత్రను తెలుసుకుంటూ.. అక్కడ శాసనాలుంటే వాటిని ఆరా తీసే క్రమంలో శివశంకర్‌కు చరిత్రపై ఆసక్తి ఏర్పడింది. క్రమేపీ అదే హాబీగా మారింది. తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలు చదవటం, కొత్త శాసనాలను సేకరించటం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అధ్యయనంలో పాత తెలుగు శాసనాలను చదవటం సాధించారు. సంస్కృతంలో ఉన్న శాసనాలకు తెలిసిన వారిపై ఆధారపడుతున్నారు. శివశంకర్ గుంటూరు జిల్లాలోని ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు కాలినడకన వెళ్లారు. అందుబాటులో ఉన్న స్థానిక రికార్డుల్ని తిరగేసి.. కల్నల్ మెకంజీ రాతల్ని తడిమి చూశారు. సమీప గ్రామాల్లోని పెద్దల్ని పలకరించారు. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను ‘గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు’ పేరుతో గ్రంథస్థం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామం పింగళి గురించి రచయిత ఇచ్చిన వివరణ చరిత్రకారులను ఆకట్టుకుంది. పింగళి అనగానే ఆధునిక సినీకవి పింగళి నాగేంద్రరావు, మధ్యయుగంలో అష్టదిగ్గజాల్లో ప్రముఖుడు, ‘కళాపూర్ణోదయం’ సృష్టికర్త పింగళి సూరనకవి, కాకునూరి అప్పకవీంద్రుల పుట్టుపూర్వోత్తరాలను తిరగదోడటం ద్వారా శివశంకర్, సాహిత్యంపై తనకు గల మమతానురాగాన్ని బహిర్గతం చేశారు. రెంటాల బ్రహ్మీ శాసనంలో ప్రస్తావించిన ‘నిడిగల్లు’ గ్రామం, క్రీ.శ 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకు రాజధానిగా నాగార్జునుని కోట విజయపురిలో ఉన్నదనే ఆధారం ఇచ్చారు. దుర్గి మండలంలోని అదృశ్య గ్రామం ‘దద్దనాలపాడు’ ఒకప్పుడు రాజ స్త్రీల సతీసహగమనం జరిగిన ప్రదేశమట. తెనాలి రామలింగకవి స్వస్థలం గార్లపాడు తెనాలి మండల గ్రామం కొలకలూరుకు సమీపంలోని అదృశ్య గ్రామమని తేల్చారు శివశంకర్. అదృశ్య గ్రామ చరిత్రలను అందించిన శివశంకర్‌ను ‘అయ్యంకి–వెలగా పురస్కారం’ వరించింది. -
కట్న దాహానికి గర్భిణి బలి
మొయినాబాద్, న్యూస్‌లైన్: కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి అదనపు కట్నం కోసం కుటుంబీకులు ప్రత్యక్ష నరకం చూపించారు. అత్త, ఆడపడుచులు పురుగుమందు తాగించి చంపేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. వివాహం జరిగి ఏడాది గడవక ముందే ఆమెకు నూరేళ్ల నిండాయి. ఈ సంఘటన మండలంలోని కనకమామిడిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అప్పారెడ్డిగూడకు చెందిన సిద్దులూరి నర్సింహ మూడేళ్ల క్రితం తల్లి రుక్కమ్మతో కలిసి కనకమామిడి గ్రామానికి వలస వచ్చాడు. అతడి సోదరి నీలమ్మ కూడా గ్రామంలోనే ఉండడంతో ఆమె ఇంటి పక్కనే ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. మరో సోదరి ఆండాళు కూడా పుట్టింట్లోనే ఉంటోంది. నర్సింహ నగరంలోని మెహిదీపట్నంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2012 నవంబర్‌లో అతడు రాజేంద్రనగర్‌కు చెందిన విద్య అలి యాస్ సుజాత(20)ను వివాహం చేసుకున్నాడు. విద్య తల్లిదండ్రులు 3 తులాల బంగారం, రూ. 30 వేల నగదు, ఇతర సామగ్రి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం విద్య 8 నెలల గర్భవతి. అదనపు కట్నం తీసుకురావాలని విద్యను అత్త రుక్కమ్మ, ఆడపడుచులు నీలమ్మ, ఆండాళు తరచూ వేధిస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం రోజుమాదిరిగానే నర్సింహ డ్యూటీకి వెళ్లాడు. అదనపు కట్నం విషయమై రాత్రి విద్యతో అత్త, ఆడపడుచులు తిరిగి గొడవపడ్డారు. నర్సింహ ఇంట్లో లేనిది అదునుగా భావించి విద్యతో బలవంతంగా పురుగుమందు తాగించారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి అత్త, ఆడపడుచులు పరారయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో నర్సింహ ఇంటికి వచ్చాడు. లైట్లు ఆన్ చేయగా విద్య నోట్లో నుంచి నురగలు కక్కుతూ గమనించాడు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. వెంటనే మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్య మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి వివరాలు సేకరించారు. శుక్రవారం మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. భార్య మృతితో నర్సింహ కన్నీటిపర్యంతమయ్యాడు. మృతురాలి తల్లి పెండ్యాల లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.