మాట్లాడుతున్న డిజిటల్ గ్రీన్ సీఈవో రికీన్ గాంధీ
సాక్షి, అమరావతి/గుంటూరురూరల్: మిరపలో నాణ్యత, దిగుబడుల పెంపే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘ఈ–మిర్చ్’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రమంతా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని డిజిటల్ గ్రీన్ వ్యవస్థాపకుడు రికీన్ గాంధీ(యూఎస్‌ఏ), బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ శ్రీవల్లీకృష్ణన్‌లు తెలిపారు. 2021లో చేపట్టిన ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవంతమైందన్నారు.
తామందించిన సాంకేతిక పరిజ్ఞానం రైతు భరోసా కేంద్రాల వల్ల గ్రామ స్థాయిలో రైతులకు వేగంగా చేరిందని, ఆర్బీకే వ్యవస్థ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగని అభివర్ణించారు. ఆర్బీకేల ద్వారా వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మిరపతో పాటు ఇతర పంటలకు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
మిరప రైతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలపై గుంటూరులో బుధవారం నిర్వహించిన ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌లో వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని మిర్చి రైతులకు డిజిటల్ మార్గాల ద్వారా సలహాలు అందించామన్నారు.
రసాయన పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించుకుంటూ.. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై 4–6 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియో సందేశాలను ఆర్బీకే స్థాయిలో పికో ప్రొజెక్టర్ల ద్వారా రైతులకు చేరువచేశామని వివరించారు.
ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్ ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు డిజిటల్ గ్రీన్, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ముందుకెళ్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment