
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్‌కు ప్రకటించిన ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో) ప్రకారం నెలవారీ ధరలను నిర్ణయిస్తూ ఉద్యాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021–22 సీజన్‌లో రైతుల నుంచి సేకరించే ఆయిల్ పామ్ గెలలకు 19.22 శాతం ఓఈఆర్‌తో పాటు కెర్నిల్ నట్స్‌కు 10.25 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఈఆర్‌కు అనుగుణంగా ప్రకటించిన నెలవారీ ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు.
తాజా ధరలతో తెలంగాణ రైతులకంటే రాష్ట్ర రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు ఈ సీజన్‌లో తెలంగాణ రైతులకు మార్చి నెలలో టన్నుకు గరిష్టంగా రూ.19,499 ధర లభిస్తే.. అదే నెలలో ఏపీ రైతులకు రూ.22,461 చొప్పున ధర లభించింది. ఈ లెక్కన తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులు టన్నుకు రూ. 2,962 వరకు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఈ సీజన్‌లో ఏపీలో గరిష్టంగా మే నెలలో టన్నుకు రూ.23,365 రైతులకు లభిస్తుంది. అదే తెలంగాణలో రూ.22,841 (ఏప్రిల్ నెలలో) మాత్రమే.