సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రెండ్రోజులుగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వడగండ్లు, అకాల వర్షాలతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా నర్సంపేట ప్రాంతంలో పండుకు వచ్చిన మిర్చి పంట పూర్తిగా నీట మునిగిందన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలపై సీఎం కేసీఆర్ స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా ఆదేశించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపు కోకుండా ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment