
పంట లేకపోయినా.. ధర పతనం.!
మిరప రైతులకు నోట్ల కష్టాలు
ముందుకు రాని వ్యాపారులు
పంట ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నప్పుడు ధర పతనం కావడం సహజమే. అయితే పంట లేనప్పుడు ధర పతనమైతే... అది రైతు దౌర్భగం కాక మరేమవుతుంది! అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ రైతులు. రూ. లక్షలు వ్యయంతో మిరప సాగు చేసిన అన్నదాతలకు నోటు కష్టాలు చావుదెబ్బతీశాయి. కరెన్సీ కొరతతో పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి. అదే సమయంలో రైతు అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు ప్రవేశించి మిర్చి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. ఈ పరిస్థితితో మిర్చి రైతులు కుదేలవుతున్నారు.
- డి.హీరేహాళ్
డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా గత ఏడాది (2015) 3,800 ఎకరాల్లో వివిధ రకాల మిర్చిని రైతులు సాగు చేశారు. ఎకరాకు 17 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటాల్ మిర్చి రకాన్ని బట్టి రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు అమ్ముడు పోయింది.
దిగుబడి తగ్గినా...
గతంలో మిర్చి లాభాలను కురిపించడంతో ఈ ఏడాది (2016)లో డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా 4,800 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఇందు కోసం రూ. 4.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో పంట సాగుకు అవసరమైన నీరు లభ్యం కాలేదు. దీంతో అనూహ్యంగా పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మొత్తం పంటను లెక్కించినా.. రూ. 3 కోట్లకు మించి లేదు. పెట్టుబడులను కూడా నష్టపోయిన రైతులు వందల్లోనే ఉన్నారు.
కరెన్సీ కొరతతో మరిన్ని కష్టాలు
మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే ఆశించిన మేర పంట దిగుబడి లేక కుదేలైన రైతులకు నోట్ల రద్దు ప్రభావం మరింత భారమైంది. పండిన అరకొర పంట కొనుగోళ్లకు కరెన్సీ కొరత అడ్డుగా నిలుస్తోంది. డబ్బు లేకపోవడంతో పంట కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. నోట్ల రద్దుకు ముందు గుంటూరు రకం మిర్చి క్వింటాళ్ రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 6వేల నుంచి రూ. 7 వేల లోపు అడుగుతున్నారు. అదేవిధంగా రూ. 24వేలతో అమ్ముడు పోయిన డబ్బి రకం మిర్చి రూ. 12 వేలకు మించి అడగడం లేదు. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు మిర్చిని తీసుకెళ్లి విక్రయించినా.. కరెన్సీ కొరత ప్రభావంతో మరో నెల రోజులు డబ్బు కోసం ఆగాల్సి వస్తోంది.
ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి
డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం, మురడి, హొసగుడ్డం, సోమలాపురం, హడగలి, మల్లికేతి, చెర్లోపల్లి తదితర గ్రామాల్లో మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు కోసం రూ. లక్షవరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు మల్లికార్జునరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, వన్నూరు స్వామి, హనుమయ్య, క్రిష్ణ, పరమేశ్వరప్ప తదితరులు తెలిపారు. ప్రస్తుతం ధర పతనం కావడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చేతికి డబ్బు రావడం లేదు
నోట్ల రద్దు ప్రభావంతో పెద్దల ఇబ్బంది దేవుడెరుగు, సామాన్య రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పంట అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే... డబ్బు లేదంటూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకవేళ పంట అమ్ముకున్న చేతికి డబ్బు అందడం లేదు.
– లక్ష్మిరెడ్డి, సోమలాపురం గ్రామ రైతు
ధర పడిపోయింది
నీరు లేకపోవడంతో పంట అంతంత మాత్రంగానే వచ్చింది. గతంలో మాదిరిగానే మంచి ధర ఉంటుందని అనుకున్నాం. అయితే నోట్ల రద్దు కారణంగా పంటను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెట్టబడులు కూడా గిట్టుబాటు కానంత తక్కువ ధరకు పంటను అడుగుతున్నారు.
– హనుమయ్య, హడగలి రైతు
మిర్చి ధరలు ఇలా ఉన్నాయి...
మిరప రకం నోట్ల రద్దుకు ముందు రద్దు తర్వాత
డబ్బి కాయ 24,000 12,500
బ్యాడిగి 18,000 12,000
గుంటూరు కడ్డికాయ 13,500 6,000