notes problems
-
పంట లేకపోయినా.. ధర పతనం.!
మిరప రైతులకు నోట్ల కష్టాలు ముందుకు రాని వ్యాపారులు పంట ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నప్పుడు ధర పతనం కావడం సహజమే. అయితే పంట లేనప్పుడు ధర పతనమైతే... అది రైతు దౌర్భగం కాక మరేమవుతుంది! అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ రైతులు. రూ. లక్షలు వ్యయంతో మిరప సాగు చేసిన అన్నదాతలకు నోటు కష్టాలు చావుదెబ్బతీశాయి. కరెన్సీ కొరతతో పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి. అదే సమయంలో రైతు అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు ప్రవేశించి మిర్చి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. ఈ పరిస్థితితో మిర్చి రైతులు కుదేలవుతున్నారు. - డి.హీరేహాళ్ డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా గత ఏడాది (2015) 3,800 ఎకరాల్లో వివిధ రకాల మిర్చిని రైతులు సాగు చేశారు. ఎకరాకు 17 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటాల్ మిర్చి రకాన్ని బట్టి రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు అమ్ముడు పోయింది. దిగుబడి తగ్గినా... గతంలో మిర్చి లాభాలను కురిపించడంతో ఈ ఏడాది (2016)లో డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా 4,800 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఇందు కోసం రూ. 4.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో పంట సాగుకు అవసరమైన నీరు లభ్యం కాలేదు. దీంతో అనూహ్యంగా పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మొత్తం పంటను లెక్కించినా.. రూ. 3 కోట్లకు మించి లేదు. పెట్టుబడులను కూడా నష్టపోయిన రైతులు వందల్లోనే ఉన్నారు. కరెన్సీ కొరతతో మరిన్ని కష్టాలు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే ఆశించిన మేర పంట దిగుబడి లేక కుదేలైన రైతులకు నోట్ల రద్దు ప్రభావం మరింత భారమైంది. పండిన అరకొర పంట కొనుగోళ్లకు కరెన్సీ కొరత అడ్డుగా నిలుస్తోంది. డబ్బు లేకపోవడంతో పంట కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. నోట్ల రద్దుకు ముందు గుంటూరు రకం మిర్చి క్వింటాళ్ రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 6వేల నుంచి రూ. 7 వేల లోపు అడుగుతున్నారు. అదేవిధంగా రూ. 24వేలతో అమ్ముడు పోయిన డబ్బి రకం మిర్చి రూ. 12 వేలకు మించి అడగడం లేదు. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు మిర్చిని తీసుకెళ్లి విక్రయించినా.. కరెన్సీ కొరత ప్రభావంతో మరో నెల రోజులు డబ్బు కోసం ఆగాల్సి వస్తోంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం, మురడి, హొసగుడ్డం, సోమలాపురం, హడగలి, మల్లికేతి, చెర్లోపల్లి తదితర గ్రామాల్లో మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు కోసం రూ. లక్షవరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు మల్లికార్జునరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, వన్నూరు స్వామి, హనుమయ్య, క్రిష్ణ, పరమేశ్వరప్ప తదితరులు తెలిపారు. ప్రస్తుతం ధర పతనం కావడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి డబ్బు రావడం లేదు నోట్ల రద్దు ప్రభావంతో పెద్దల ఇబ్బంది దేవుడెరుగు, సామాన్య రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పంట అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే... డబ్బు లేదంటూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకవేళ పంట అమ్ముకున్న చేతికి డబ్బు అందడం లేదు. – లక్ష్మిరెడ్డి, సోమలాపురం గ్రామ రైతు ధర పడిపోయింది నీరు లేకపోవడంతో పంట అంతంత మాత్రంగానే వచ్చింది. గతంలో మాదిరిగానే మంచి ధర ఉంటుందని అనుకున్నాం. అయితే నోట్ల రద్దు కారణంగా పంటను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెట్టబడులు కూడా గిట్టుబాటు కానంత తక్కువ ధరకు పంటను అడుగుతున్నారు. – హనుమయ్య, హడగలి రైతు మిర్చి ధరలు ఇలా ఉన్నాయి... మిరప రకం నోట్ల రద్దుకు ముందు రద్దు తర్వాత డబ్బి కాయ 24,000 12,500 బ్యాడిగి 18,000 12,000 గుంటూరు కడ్డికాయ 13,500 6,000 -
ప్రాణాలు పోతున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:జిల్లావ్యాప్తంగా నోట్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులు దాటింది. రానురాను నోట్ల ఇబ్బందులు తొలగుతాయనుకుంటే.. మరింతగా పెరుగుతున్నాయి. డబ్బుల కోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా చేతికి పైసా అందడం లేదు. కొన్ని బ్యాంకులు ఏటీఎంలను అస్సలు తెరవడం లేదు. జిల్లావ్యాప్తంగా 450కిపైగా ఏటీఎంలు ఉంటే అందులో 50 కూడా పని చేయడం లేదు. డబ్బుల కోసం జనం రేయింబవళ్లు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అయినా డబ్బులు అందకపోవడంతో సహనం నసిస్తోంది. వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న చంద్రబాబుపైనా, అటు నోట్లను రద్దు చేసిన కేంద్రంపైనా జనం ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతున్నారు. డబ్బుల కోసం పీసీపల్లి మండలం పెదవీర్లపాడు సిండికేట్ బ్యాంకు ముందు స్థానికులు ఆందోళనకు దిగితే.. డబ్బులు అందలేదన్న ఆవేదనతో ముండ్లమూరు మండలం పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకుడు బుచ్చి నాగమునిరెడ్డి ఏకంగా గుండెపోటుతో ప్రాణాలే కోల్పోయాడు. సామాన్యుల చేతికందని నోట్లు.. ఇప్పటి వరకు జిల్లాకు ఆర్బీఐ నుంచి రూ.2,800కోట్లు డబ్బులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా యి. తాజాగా శనివారం సాయంత్రానికి మరో రూ.220 కోట్లు జిల్లాకు రానుంది. రూ.180 కోట్లు(రూ.2వేల నోట్లు), మరో రూ.40 కోట్లు(రూ.500 నోట్లు) రానున్నట్లు సమాచారం.ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.3వేల కోట్ల డిపాజిట్లు రాగా,రూ.1200 కోట్లు విత్‌డ్రాయల్స్ జరిగా యి. ఇంత డబ్బులు జిల్లాకు వచ్చిన సామాన్య జనానికి మాత్రం డబ్బులు అందటం లేదు.కొన్ని బ్యాంకుల నుంచి కొందరు బడా బాబులకు నేరుగా డబ్బులుఅందుతున్నట్లు ఆరోపణలున్నాయి.డబ్బులు మార్చుకునేందుకు కొందరు నేతలుఅధికారాన్ని అడ్డు పెడుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ కారణాలతోనే ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బులు సామాన్యులకు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. వచ్చిన డబ్బులో అధిక మొత్తం పెద్దలకే సరిపోతుండటంతో సామాన్యులకు తగినంత డబ్బులు అందుబాటులో ఉండ టం లేదు. జిల్లా కేంద్రాలు మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఏటీఎంలతో పాటు డబ్బుల్లేక కొన్ని బ్యాంకులను సైతం మూసివేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల కష్టాలు అధికమయ్యాయి. వారిలో ఆవేదనతో పాటు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. -
పల్లెను పీడిస్తున్న నోట్ల రగడ
డబ్బు కోసం ఔరంగాబాద్‌లో స్టేషన్‌రోడ్‌లోని ఒక బ్యాంక్ శాఖ ముందు నిలబడిన వడ్రంగి సయ్యద్ మోదక్ ‘‘చాలా ఆస్పత్రులలోను, మందుల దుకాణాలలోను రూ. 500, రూ. 1,000 నోట్లను స్వీకరించడం లేద’’ని చెప్పాడు. తీవ్ర అనారోగ్యం పాలైన తన బంధువు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతడు ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఏ ఆస్పత్రిలోను ఆ నోట్లు తీసుకోవడానికి అంగీకరించలేదని అతడు చెప్పాడు. ఇప్పుడు అందరి కళ్లు నాసిక్ మీదే ఉన్నాయి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కల ఆ గ్రామంలో సాకారమైనట్టే కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్ట ణానికి దగ్గరగా, ఇంకా చెప్పాలంటే రేపో మాపో ఆ పట్టణంలో భాగ మైపోతుందనిపిస్తున్న షికల్థానా గ్రామంలో ఎవరి దగ్గరా చిల్లిగవ్వ లేదు. బ్యాంకులనే కాదు, ఏ బ్యాంకు ఏటీఎం ముందు కూడా ప్రజలెవరూ ఉçస్సూరంటూ బారులు తీరడం లేదు. సాధారణంగా బ్యాంకు శాఖల ముందు నిఘా వేసే పోలీసులు కూడా ఎక్కడా కనిపించరు. అయినా సంతోషించవలసిన విషయం– త్వరలో ఆ ఊరి వారందరి వేళ్ల మీద సిరా గుర్తులు దర్శనమివ్వబోతున్నాయి. అయితే కొంచెం అవతలే ఉన్న చరిత్రాత్మక ఔరంగాబాద్‌లోని ఒక హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ శాఖలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడి షాహగంజ్ ఎస్బీహెచ్ శాఖ సిబ్బంది నిరుపేదలైన తమ ఖాతాదారులకు సేవలు అందించలేక తీవ్ర నిస్పృహకు లోనవుతున్నారు. ఈ ఒక్క బ్యాంకు శాఖలోనే కాదు, ఇతర బ్యాంకుల శాఖలలో కూడా బాగా చివికి, నలిగిపోయి; ఇక ధ్వంసం చేయడానికి రిజర్వు బ్యాంకుకు పంపేందుకు సిద్ధం చేసిన రూ 50, రూ. 100 నోట్లను మరోసారి చెలామణిలోకి తెచ్చేందుకు కోట్లలో తెచ్చి పెట్టారు. ఈ సంగతి రిజర్వు బ్యాంకుకు తెలుసు. అయినా మౌనం దాల్చింది. ‘మన ముందున్న అవకాశాలు ఏమిటి?’ అని బ్యాంకు సిబ్బందిని అడగాలి. ప్రస్తుతం ప్రజలకి చిన్న నోట్ల అవసరమే ఎక్కువ. అవి లేక ప్రస్తుతం ప్రజల పనులు, లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఆ ఆదివారం మేం ఇలా సిబ్బందితో మాట్లాడుతుంటే, బ్యాంకు ముందు కిలోమీటరు మేర ఉన్న ఆ క్యూ నుంచి జావెద్ హయత్ ఖాన్ అనే చిరు వ్యాపారి మా దగ్గరకి వచ్చాడు. తన కుమార్తె రషీదా ఖాతున్ వివాహ శుభలేఖను అందించాడు. ‘‘నా బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం రూ. 27,000’’ అంటూ అతడు చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘మరో మూడు వారాలలో జరగబోయే నా కూతురి పెళ్లి కోసం అందులోనే రూ. 10,000 ఇవ్వాలని కోరాను. ఆ మొత్తం తీసుకోవడానికి కూడా నన్ను అనుమతించడంలేదు’’ అన్నాడతడు. నిజానికి అతడు అంతకు ముందు రోజే రూ. 10,000 విత్‌డ్రా చేసుకున్నాడు. మరో రూ. 10,000 మరునాడు తీసుకుందామని అనుకున్నాడు. ఇంతలోనే బ్యాంకు డబ్బు తీసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. ఎందుకంటే పాము మెలికలను మరిపిస్తూ బారులు తీరిన ఆ జనానికి కావలసినంత పైకం బ్యాంకులో లేదని సిబ్బంది నమ్మకం. ప్రతి వ్యక్తికి కొద్దిపాటి మొత్తాన్ని ఇవ్వడమే సాధ్యం కావచ్చునని కూడా వారు భావించారు. అందుకే కూతురి పెళ్లి కోసం ఆందో ళన పడుతున్న ఖాన్‌కు చేయూతనివ్వాలని ఇద్దరు ప్రయత్నించారు. అతడి ఖాతాలో జమ అయిన మొత్తం కూతురి పెళ్లి కోసం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చినదేనని వారు వివరించారు. ఇప్పటికే చాలామంది విశ్లేషకులు, రచయితలు, ఆఖరికి అధికారిక నివే దికలు వెల్లడించినట్టు భారత ‘నల్ల’ ఆర్థిక వ్యవస్థ బంగారం రూపంలోను, భూ బినామీ వ్యవహారాలతో పాటు విదేశీ కరెన్సీ రూపంలోను ఉంది. అంతేతప్ప, మామ్మగారి పాత బోషాణంలో కట్టల రూపంలో లేదు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు చైర్మన్ చెప్పింది కూడా ఇదే. ‘దేశ విదేశాలలోని నల్లధనం సమస్యను ఎదుర్కొనడం ఎలా?’ అన్న పేరుతో 2012లో ఇచ్చిన ఒక నివేదికలో ఆయన పేర్కొన్న అంశమిది. గతంలో 1946, 1978లలో రెండు పర్యాయాలు నోట్ల రద్దు కోసం చేసిన ప్రయత్నం ఎంత విషాదాం తమైందో కూడా ఆ నివేదికలోనే (పేజీలు 14, పార్ట్ 2, 9.1) ప్రస్తావించారు. అయినప్పటికీ సరిగ్గా ఈ పనినే భారతీయ జనతా పార్టీ పునరావృతం చేసింది. నోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర క్షోభను, దుఃఖాన్ని కలిగించిన, నమ్మశక్యం కూడా కాని ఈ అవివేకపు చర్యను ఆకాశానికెత్తడానికే కొందరు యాంకర్లూ, విదూషకులూ టెలివిజన్లలో ‘మోదీ మాస్టర్‌స్ట్రోక్’ అన్న పదాన్ని సైతం ప్రయోగించారు. ఏ ‘స్ట్రోక్’ ఎవరు ఇచ్చినా దానితో గాయపడే హృదయం మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థదే. నోట్ల రద్దు స్ట్రోక్‌తో తగిలిన ఇక్కట్ల నుంచి కోలుకోవడానికి రెండు రోజులు చాలునని మొదట ఆర్థిక మంత్రి, ఆయన పార్టీ సహచరులు ధీమాగా చెప్పారు. తరువాత అరుణ్ జైట్లీ గారే కోలుకోవడానికి రెండు మూడు వారాలదాకా పడుతుందని మొదట చెప్పిన దానిని సవరించారు. ఆ తరు వాత ఆరోగ్యం సంతరించుకోవడానికి రోగికి 50 రోజుల కాలం అవసర మవుతుందని జైట్లీగారి సీనియర్ సర్జన్ నరేంద్ర మోదీ సెలవిచ్చారు. అంటే ఈ వైద్యంతోనే మనం 2017 లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ లోపున దేశ వ్యాప్తంగా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు బారులు తీరిన జనంలో ఎంతమంది రాలిపోతారో చెప్పలేం. అయితే రోజురోజుకీ అలాంటి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ‘‘నాసిక్ జిల్లా లాసాల్‌గావ్‌లో రైతులు ఈ నగదు సంక్షోభం కారణంగా ఉల్లిపాయల మార్కెట్‌కు తాళాలు బిగించి వెళ్లిపోయార’’ని ‘ఆధునిక్ కిసాన్’ వార పత్రిక సంపాదకుడు నిశికాంత్ భాలేరావ్ చెప్పారు. ‘‘విదర్భ, మరాఠ్వా డాలలో క్వింటాల్ పత్తి ధర 40 శాతం మేర శరవేగంగా పడిపోయింద’’ని కూడా తెలియచేశారు. ఎక్కడో చెదురుమదురుగా మినహా లావాదేవీలు, అమ్మకాలు స్తంభించిపోయాయి. ‘‘ఎవరి దగ్గరా డబ్బుల్లేవు. కమిషన్ ఏజెంట్లు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు– అంతా ఒకేరకంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు’’ అని ‘ది టెలిగ్రాఫ్’ నాగ్‌పూర్ విలే కరి జయదీప్ హర్దికర్ అన్నారు. ‘‘మామూలుగా గ్రామీణ ప్రాంత బ్యాంకు శాఖలలో చెక్కులను మదుపు చేయడం చాలా యాతనతో కూడిన పని. ఇప్పుడు వాటిని విత్‌డ్రా చేసుకోవడం ఒక పీడకల మాదిరిగా ఉంది’’ అని కూడా ఆయన చెప్పారు. అందుకే, చాలా తక్కువ మంది రైతులు మాత్రమే చెక్కులు తీసు కోవడానికి ఒప్పుకుంటారు. ఇదంతా వాస్తవ రూపం దాల్చేదాకా వాళ్ల ఇళ్లు గడవడం ఎలాగ? నిజానికి చాలామందికి బ్యాంకు ఖాతాలు లేనేలేవు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రభుత్వ రంగ ముఖ్య బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 975 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 549 ఏటీఎంలలో మొండిచేయి తప్ప మరో డినామినేషన్ ఏదీ లేదు. ఇలా పనిచేయకుండా ఉన్న ఏటీఎంలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. కిందిస్థాయిలో జరిగే లావాదేవీలో నగదు వెల్లువెత్తుతూ ఉంటుంది. ఒక వారంలోగా చిన్న చిన్న నోట్లు బ్యాంకులకు చేరకపోతే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాగలదని గ్రామీణ ప్రాంత బ్యాంకుల సిబ్బంది ఊహిస్తోంది. అయితే, ఇప్పటికే సంక్షోభం ఇక్కడ తలెత్తిందనీ, ఏదో కొంత పైకం బ్యాంకు లకు చేరినా ఆ సంక్షోభాన్ని నిలువరించడం సాధ్యం కాదనీ ఇతరులు అభి ప్రాయపడుతున్నారు. తన దగ్గర పనిచేస్తున్న కూలీలు ఇవాళో రేపో హింసాత్మక బాట పట్టక తప్పకపోవచ్చునని ఔరంగాబాద్‌లోనే డబ్బు కోసం క్యూలో నిలబడిన పర్వేజ్ పైథాన్ చెప్పారు. ఆయన భవన నిర్మాణ రంగంలో పనిచేస్తారు. ‘‘ఇప్పటి దాకా వారు చేసిన పనికి కూలీ చెల్లించవలసి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ల చేతిలో పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు’’ అని పర్వేజ్ వివరించాడు. పిల్లలకు ఆహారం సమకూర్చి పెట్టడం తమలాంటి తల్లులకు రోజు రోజుకు భారంగా మారిపోతోందని షికాల్థానాకే చెందిన రెయిసా అఖ్తర్ ఖాన్ వాపోయారు. ‘‘మేం గంటల తరబడి క్యూలో నిలబడవలసి వస్తోంది. దానితో పిల్లలకు వేళకు తిండి లభించక ఆకలితో మాడుతున్నార’’ని కూడా ఆమె చెప్పారు. తమ ఇళ్లలో వంట సంబారాలు రెండు నుంచి నాలుగు రోజులకు మించి రావని క్యూలలో నిలబడిన చాలామంది మహిళలు చెప్పారు. ఈ లోపున నోట్ల సమస్య సమసిపోవడం సాధ్యంకాదన్న సంగతి వారిని గడగడలా డిస్తోంది. అవును, అంతేకావచ్చు. రైతులు, భూమిలేని కూలీలు, పనిమనుషులు, పింఛనుదారులు, చిన్న వ్యాపారులు ఇంకా ఇతర వర్గాల వారు ఈ సమస్యతో సతమతమవు తున్నారు. చాలా వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా అప్పుల పాల వుతున్నారు. తాము చేయవలసిన చెల్లింపుల కోసం అప్పులు తీసుకుంటు న్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేయడానికి కూడా క్యూలలో నిలబడు తున్నారు. ‘రోజులు గడిచే కొద్దీ ఈ క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు’ అని ఔరంగాబాద్‌లోని స్టేషన్ రోడ్ శాఖ ఉద్యోగి ఒకరు చెప్పారు. గరిష్టంగా రూ. 500 నోట్లు ఎనిమిది లేదా, రూ. 1,000 నోట్లు రెండు మార్చుకోవడానికి అనుమతించారు. ఈ లావాదేవీని ఒక్కసారే చేసుకోవడా నికి అనుమతి ఉంది. ఒకవేళ మళ్లీ నోట్లు మార్చుకోవాలంటే ఒక రోజు ఆగాలి. అది కూడా వేరే గుర్తింపుతో లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇవాళ ఆధార్‌కార్డును ఆధారంగా చూపితే రేపు పాస్‌పోర్టు, ఎల్లుండి పాన్ కార్డు చూపిస్తూ మీ ఉనికిని గుర్తు పట్టకుండా నోట్లు మార్చాలి. ప్రస్తుతం ఈ కిటుకు తెలిసినవాళ్లు కూడా తక్కువే. చాలామందికి ఈ సంగతి తెలియదు. కానీ పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం వెర్రి తనం అవధులు దాటిపోయింది. క్యూలలో నిలబడి డబ్బులు తీసుకున్న తరువాత పోలింగ్ సమయంలో వేసినట్టు చెరగని ముద్రను వేళ్ల మీద వేయ డానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబ్బు కోసం ఔరంగాబాద్‌లో స్టేషన్‌రోడ్‌లోని ఒక బ్యాంక్ శాఖ ముందు నిలబడిన వడ్రంగి సయ్యద్ మోదక్ ‘‘చాలా ఆస్పత్రులలోను, మందుల దుకాణాలలోను రూ. 500, రూ. 1,000 నోట్లను స్వీకరించడం లేద’’ని చెప్పాడు. తీవ్ర అనారోగ్యం పాలైన తన బంధువు ప్రాణాలు కాపా డుకోవడానికి ఇతడు ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఏ ఆస్పత్రిలోను ఆ నోట్లు తీసుకోవడానికి అంగీకరించలేదని అతడు చెప్పాడు. ఇలా ఉండగా ఇప్పుడు అందరి కళ్లు నాసిక్ మీదే ఉన్నాయి. కొత్తగా అచ్చయిన కరెన్సీ అక్కడ నుంచే దేశం నలుమూలలకీ పంపిస్తారు. అందులో ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల వారికి ఏమీ చేరలేదు. అక్కడికి డబ్బులు చేరే రోజు కోసం వారు ఎదురు చూస్తున్నారు. వ్యాసకర్త పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు ఎవ్రిబడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్ గ్రంథకర్త ఈ–మెయిల్: @PSainath.org పాలగుమ్మి సాయినాథ్ -
నోట్ల కష్టాలు రెట్టింపు
– సెలవు రోజు కావడంతో బ్యాంకుల వద్ద పోటెత్తిన ప్రజలు – కొన్ని బ్యాంకుల్లోనే నోట్ల మార్పిడి, భారీగా పెరిగిన డిపాజిట్లు – పనిచేయని ఏటీఎంలు, ఖాతాదారులకు తప్పని తిప్పలు ప్రజలకు నోట్ల మార్పిడి కష్టాలు రెట్టింపయ్యాయి. డబ్బు లేక రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో అన్ని వర్గాల ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు తన మాటను నిలుపుకునే పరిస్థితి కనిపించకపోవడంతో రోజురోజుకూ జనం సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. వరుసగా మూడోరోజు శనివారం కూడా బ్యాంకులన్నీ జనంతో పోటెత్తాయి. సెలవు రోజు కావడంతో మొదటి రెండు రోజులకన్నా మూడో రోజు రద్దీ మరింత ఎక్కువ కావడంతో కొన్ని చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కొన్ని చోట్ల క్యూలైన్లు రోడ్డుమీదకు వచ్చాయి. రూ.4 వేల నగదు మార్పిడి కోసం క్యూలో నలిగిపోతున్నా చాలా మందికి అందడం లేదు. చెస్ట్ కలిగివున్న స్టేట్‌బ్యాంకు, సిండికేట్, కెనరాబ్యాంకు లాంటి కొన్ని బ్యాంకులకు కొంత వరకు నగదు సరఫరా అవుతున్నా చాలా బ్యాంకులకు మూడో రోజు కూడా నగదు చేరకపోవడంతో నోట్ల మార్పిడికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఎక్కువ మంది దాచుకున్న డబ్బులు డిపాజిట్ చేయడం మినహా చేతికి తీసుకోలేక పోతున్నారు. చేతిలో డబ్బుల్లేక కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. పనిచేయని ఏటీఎంలు శనివారం కూడా ఏటీఎం కేంద్రాలు చాలా వరకు పనిచేయలేదు. జిల్లా వ్యాప్తంగా 500పైగా ఏటీఎంలు ఉన్నా అందులో 40 నుంచి 50 ఏటీఎంలు పనిచేశాయి. అందులో పెట్టిన రూ.100 నోట్ల నిల్వలు అయిపోవడంతో అవి కూడా కొన్ని గంటలకే మూతబడ్డాయి. ఎక్కడ చూసినా 'నో క్యాష్' బోర్డులు దర్శనిమస్తున్నాయి. రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. పోస్టాఫీసుల్లో కూడా తగినంత నిల్వలు లేక నగదు మార్పిడి అరకొరగా సాగడంతో జనం నిరాశ వ్యక్తం చేశారు. కొత్త అకౌంట్లు, పాన్ కార్డులకు గిరాకీ రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. రూ.2.50 లక్షలకు మించి డిపాజిట్ చేసిన మొత్తం ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని, లేదంటే మొత్తానికి సరైన లెక్కాచారాలు చూపాల్సి ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరున కొత్త అకౌంట్లు తెరవడానికి, పాన్‌కార్డులు పొందడానికి ఎగబడుతున్నారు. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఇంకా బయటకు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎలాగోలా సర్దుబాటు చేసుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో రూ.500 నోట్లు తీసుకోలేదు కొడుక్కి ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించా. అయితే రూ.500, రూ.1,000 ఇస్తే వారు తీసుకోవడం లేదు. కొత్త నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళితే రద్దీ మరీ ఎక్కువగా ఉంది. ఇంకొన్ని బ్యాంకుల్లో డబ్బులు మార్చి ఇవ్వడం లేదు. ఏమి చేయాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. – కేశవరెడ్డి, దాడితోట గ్రామం కొద్దిరోజులు ఇబ్బందే రూ.100 నోట్లు నగదు సరఫరా తక్కువగా ఉండటంతో కొద్ది రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజురోడ్డులో ఉన్న ఏపీజీబీ ప్రధానశాఖలో డిపాజిట్లు కోసం వీఐపీ కౌంటర్ కూడా అందుబాటులో ఉంచాం. నగదు కొరత కారణంగా రూ.2 లక్షలు డిపాజిట్లు చేసిన వారికి కూడా కనీసం రూ.2 వేల నగదు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల్లోనే అంతా సర్దుకుంటుంది. - యు.శివప్రసాద్‌గుప్తా, మేనేజర్, ఏపీజీబీ అనంతపురం