సాక్షి ప్రతినిధి, ఒంగోలు:జిల్లావ్యాప్తంగా నోట్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులు దాటింది. రానురాను నోట్ల ఇబ్బందులు తొలగుతాయనుకుంటే.. మరింతగా పెరుగుతున్నాయి. డబ్బుల కోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా చేతికి పైసా అందడం లేదు. కొన్ని బ్యాంకులు ఏటీఎంలను అస్సలు తెరవడం లేదు. జిల్లావ్యాప్తంగా 450కిపైగా ఏటీఎంలు ఉంటే అందులో 50 కూడా పని చేయడం లేదు. డబ్బుల కోసం జనం
రేయింబవళ్లు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అయినా డబ్బులు అందకపోవడంతో సహనం నసిస్తోంది. వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న చంద్రబాబుపైనా, అటు నోట్లను రద్దు చేసిన కేంద్రంపైనా జనం ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతున్నారు. డబ్బుల కోసం పీసీపల్లి మండలం పెదవీర్లపాడు సిండికేట్ బ్యాంకు ముందు స్థానికులు ఆందోళనకు దిగితే.. డబ్బులు అందలేదన్న ఆవేదనతో ముండ్లమూరు మండలం పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకుడు బుచ్చి నాగమునిరెడ్డి ఏకంగా గుండెపోటుతో ప్రాణాలే కోల్పోయాడు.
సామాన్యుల చేతికందని నోట్లు..
ఇప్పటి వరకు జిల్లాకు ఆర్‌బీఐ నుంచి రూ.2,800కోట్లు డబ్బులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా యి. తాజాగా శనివారం సాయంత్రానికి మరో రూ.220 కోట్లు జిల్లాకు రానుంది. రూ.180 కోట్లు(రూ.2వేల నోట్లు), మరో రూ.40 కోట్లు(రూ.500 నోట్లు) రానున్నట్లు సమాచారం.ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.3వేల కోట్ల డిపాజిట్లు రాగా,రూ.1200 కోట్లు విత్‌డ్రాయల్స్ జరిగా యి. ఇంత డబ్బులు జిల్లాకు వచ్చిన సామాన్య జనానికి మాత్రం డబ్బులు అందటం లేదు.కొన్ని బ్యాంకుల నుంచి కొందరు బడా బాబులకు నేరుగా డబ్బులుఅందుతున్నట్లు ఆరోపణలున్నాయి.డబ్బులు మార్చుకునేందుకు కొందరు నేతలుఅధికారాన్ని అడ్డు పెడుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ కారణాలతోనే ఆర్‌బీఐ నుంచి వచ్చిన డబ్బులు సామాన్యులకు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. వచ్చిన డబ్బులో అధిక మొత్తం పెద్దలకే సరిపోతుండటంతో సామాన్యులకు తగినంత డబ్బులు అందుబాటులో ఉండ టం లేదు. జిల్లా కేంద్రాలు మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఏటీఎంలతో పాటు డబ్బుల్లేక కొన్ని బ్యాంకులను సైతం మూసివేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల కష్టాలు అధికమయ్యాయి. వారిలో ఆవేదనతో పాటు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది.
ప్రాణాలు పోతున్నాయ్
Published Sun, Dec 18 2016 3:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
Advertisement
Advertisement