
నోట్ల కష్టాలు రెట్టింపు
– సెలవు రోజు కావడంతో బ్యాంకుల వద్ద పోటెత్తిన ప్రజలు
– కొన్ని బ్యాంకుల్లోనే నోట్ల మార్పిడి, భారీగా పెరిగిన డిపాజిట్లు
– పనిచేయని ఏటీఎంలు, ఖాతాదారులకు తప్పని తిప్పలు
ప్రజలకు నోట్ల మార్పిడి కష్టాలు రెట్టింపయ్యాయి. డబ్బు లేక రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో అన్ని వర్గాల ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు తన మాటను నిలుపుకునే పరిస్థితి కనిపించకపోవడంతో రోజురోజుకూ జనం సమస్యలు జఠిలంగా మారుతున్నాయి.
వరుసగా మూడోరోజు శనివారం కూడా బ్యాంకులన్నీ జనంతో పోటెత్తాయి. సెలవు రోజు కావడంతో మొదటి రెండు రోజులకన్నా మూడో రోజు రద్దీ మరింత ఎక్కువ కావడంతో కొన్ని చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కొన్ని చోట్ల క్యూలైన్లు రోడ్డుమీదకు వచ్చాయి. రూ.4 వేల నగదు మార్పిడి కోసం క్యూలో నలిగిపోతున్నా చాలా మందికి అందడం లేదు. చెస్ట్ కలిగివున్న స్టేట్‌బ్యాంకు, సిండికేట్, కెనరాబ్యాంకు లాంటి కొన్ని బ్యాంకులకు కొంత వరకు నగదు సరఫరా అవుతున్నా చాలా బ్యాంకులకు మూడో రోజు కూడా నగదు చేరకపోవడంతో నోట్ల మార్పిడికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఎక్కువ మంది దాచుకున్న డబ్బులు డిపాజిట్ చేయడం మినహా చేతికి తీసుకోలేక పోతున్నారు. చేతిలో డబ్బుల్లేక కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి.
పనిచేయని ఏటీఎంలు
శనివారం కూడా ఏటీఎం కేంద్రాలు చాలా వరకు పనిచేయలేదు. జిల్లా వ్యాప్తంగా 500పైగా ఏటీఎంలు ఉన్నా అందులో 40 నుంచి 50 ఏటీఎంలు పనిచేశాయి. అందులో పెట్టిన రూ.100 నోట్ల నిల్వలు అయిపోవడంతో అవి కూడా కొన్ని గంటలకే మూతబడ్డాయి. ఎక్కడ చూసినా 'నో క్యాష్' బోర్డులు దర్శనిమస్తున్నాయి. రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. పోస్టాఫీసుల్లో కూడా తగినంత నిల్వలు లేక నగదు మార్పిడి అరకొరగా సాగడంతో జనం నిరాశ వ్యక్తం చేశారు.
కొత్త అకౌంట్లు, పాన్ కార్డులకు గిరాకీ
రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. రూ.2.50 లక్షలకు మించి డిపాజిట్ చేసిన మొత్తం ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని, లేదంటే మొత్తానికి సరైన లెక్కాచారాలు చూపాల్సి ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరున కొత్త అకౌంట్లు తెరవడానికి, పాన్‌కార్డులు పొందడానికి ఎగబడుతున్నారు. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఇంకా బయటకు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎలాగోలా సర్దుబాటు చేసుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఆసుపత్రిలో రూ.500 నోట్లు తీసుకోలేదు
కొడుక్కి ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించా. అయితే రూ.500, రూ.1,000 ఇస్తే వారు తీసుకోవడం లేదు. కొత్త నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళితే రద్దీ మరీ ఎక్కువగా ఉంది. ఇంకొన్ని బ్యాంకుల్లో డబ్బులు మార్చి ఇవ్వడం లేదు. ఏమి చేయాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
– కేశవరెడ్డి, దాడితోట గ్రామం
కొద్దిరోజులు ఇబ్బందే
రూ.100 నోట్లు నగదు సరఫరా తక్కువగా ఉండటంతో కొద్ది రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజురోడ్డులో ఉన్న ఏపీజీబీ ప్రధానశాఖలో డిపాజిట్లు కోసం వీఐపీ కౌంటర్ కూడా అందుబాటులో ఉంచాం. నగదు కొరత కారణంగా రూ.2 లక్షలు డిపాజిట్లు చేసిన వారికి కూడా కనీసం రూ.2 వేల నగదు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల్లోనే అంతా సర్దుకుంటుంది.
- యు.శివప్రసాద్‌గుప్తా, మేనేజర్, ఏపీజీబీ అనంతపురం