![మిర్చి రైతుల కష్టాలపై మంత్రుల అధ్యయనం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71491506364_625x300.jpg.webp?itok=xbl_00M6)
మిర్చి రైతుల కష్టాలపై మంత్రుల అధ్యయనం
♦ కేబినెట్ నిర్ణయం
♦ కేంద్ర సాయానికి సీఎం లేఖ రాయాలని తీర్మానం
సాక్షి, అమరావతి: మిర్చి రైతులు పడుతున్న బాధలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆదేశించారు. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పునర్ వ్యవస్థీకరణ తరువాత తొలి సారిగా జరిగిన సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం రాత్రి సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విలేకరులకు మంత్రి వర్గ నిర్ణయాలు వివరించారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై కేబినెట్‌లో ఏమన్నా చర్చించారా అని ఓ విలేకరి అడగ్గా కాల్వ మౌనం వహించారు.
మంత్రుల నివేదిక ఆధారంగా...
మిర్చి రైతులతో ఇద్దరు మంత్రులు మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు ప్రభుత్వానికి నివేదించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కోరాలనేది కూడా సిఫార్సు చేయాలని, ఆ నివేదికను ఆధారంగా సహాయం కోసం కేంద్రానికి సీఎం లేఖరాయాలని కేబినెట్ తీర్మానించింది.
ఉపాధి కూలీల కోసం టోల్‌ఫ్రీ నంబర్
ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ 2017పై మున్సిపాలిటీలకు గాను ముసాయిదాను రూపొందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. మునిసిపాలిటీలన్నింటికీ ఒకే రకమైన చట్టాన్ని తీసుకు రావాలని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భూ కేటాయింపులూ.. లీజులు..
హీరో మోటార్స్‌కు భూ కేటాయింపునకు కొన్ని సవరణలను కేబినెట్ ఆమోదించింది. దీనిపై ఏపీఐఐసీకి అదేశాలు జారీ చేసింది. విజయవాడలోని మునిసిపల్ కార్పొరేషన్ సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఉన్న ఆంధ్రా హాస్పిటల్ బ్లాక్ లీజ్ కాలపరిమితిని 12 నుంచి 25 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. కడప జిల్లా బాయిలపల్లి గ్రామంలో సర్వే నెం: 685/1, 68 పరిధిలో ఉన్న 4.95 ఎకరాల భూమికి సంబంధించిన లీజు గడువును పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.