పంట నష్టంపై రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు
సాక్షి, మహబూబాబాద్: గత ఏడాది మిర్చి రైతులను గగ్గోలు పెట్టించిన నల్లతామర పురుగు మళ్లీ పంజా విసురుతోంది. మెల్లగా 40శాతం పంటకు వ్యాపించిన పురుగు.. మిర్చి పంటను నిలువునా నాశనం చేస్తోంది. ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉండటం లేదని, పూత రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ పురుగు సోకిన విషయం తెలిసిన నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌సెక్ట్ రిసోర్సెస్ (ఎన్‌బీఏఐఆర్)–బెంగళూరు, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ)–హైదరాబాద్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పంటలను పరిశీలిస్తూ.. రైతులకు సూచనలు ఇస్తున్నారు.
గత ఏడాది ఆగమాగం చేసి..
గత ఏడాది రాష్ట్రంలో మిర్చి పంటకు నల్లతామర పురుగు సోకింది. మొదటి పూత సమయంలోనే ప్రతాపం చూపింది. వేల ఎకరాలకు విస్తరించి తీవ్ర నష్టం కలగజేసింది. చాలా మంది రైతులు పెట్టుబడి కూడా చేతికి రాక అప్పుల పాలయ్యారు. మనస్తాపానికి గురై ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మిర్చికి మంచి ధర ఉండటంతో ఈసారైనా పంట బాగుంటే అప్పులు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో అదే పంట వేశారు.
మొత్తంగా రాష్ట్రంలో 2,41,908 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందులో చాలా మంది రైతులకు మొదటి పూత దశ వరకు పంట బాగానే ఉండటంతో సంతోషపడ్డారు. కానీ మొదటి కాత పడిన కొద్దిరోజులకే మళ్లీ నల్లతామర పురుగు సోకింది. ఇప్పటివరకు 90వేల ఎకరాలకుపైగా వ్యాపించింది. మరింతగా విస్తరిస్తుండటంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భూమి చదును చేయడం నుంచి విత్తనాల సేకరణ, ఎరువులు, పురుగు మందులదాకా మిర్చి సాగుకోసం ఇప్పటివరకు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు.
సోకిన ఒకట్రెండు రోజుల్లోనే..
నల్లతామర పురుగు సోకితే ఒకట్రెండు రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు చెప్తున్నారు. చేనులో పూలన్నీ రాలిపోతున్నాయని.. చెట్టు మోడుబారడం మొదలవుతోందని అంటున్నారు. పంటను రక్షించుకునేందుకు రకరకాల మందులు వాడామని.. పది, పదిహేను రోజుల్లో ఎకరానికి రూ.40 వేలకుపైగా విలువచేసే మందులు పిచికారీ చేసినా లాభం లేదని వాపోతున్నారు.
జిల్లాల్లో శాస్త్రవేత్తల పరిశీలన
నల్లతామర సోకిన విషయం తెలుసుకున్న ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్తలు కె.శ్రీదేవి, రచన, కందన్, సీఐపీఎంసీ శాస్త్రవే త్తలు సునీత, నీలారాణి, రవిశంకర్‌లతోపాటు ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు శ్రీధర్, వెంకటరమణ, ఇతర ఉద్యాన శాస్త్ర వేత్తలు వారం రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మి ర్చిసాగు అధికంగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్ భూపా లపల్లి, వరంగల్ జిల్లాలకు వెళ్లి.. గత ఏడాదికి ఇప్పటికి పురుగులో వచ్చిన తేడా, పంటను ఆశించిన తీరును పరి శీలించారు. నల్ల తామర నియంత్రణ కోసం బవేరియా భాసియానా, లెకానీసీలియం లెకానీ, సూడోమోనాస్, బ్యాసిల్లస్, సబ్‌టైలిస్ పౌడర్లను ప్రయోగత్మకంగా రైతుల మిర్చి తోటల్లో పిచికారీ చేయించారు.
కీటకనాశని జీవ శిలీంధ్రాలతో ఫలితం
నల్ల తామర పురుగు నివారణ కోసం ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త కందన్ నేతృత్వంలో తయారుచేసిన కీటకనాశని జీవ శిలీంధ్రాలు మంచి ఫలితం ఇస్తున్నాయి. కర్ణాటకలోని మిర్చి తోటలపై ప్రయోగాత్మకంగా పిచికారీ చేశాం. తెలంగాణలోనూ అదే రకమైన నల్లతామర పురుగు ఆశించినట్టు నిర్ధారించాం. ఇక్కడా బ్యాలిల్లస్, సూడోమోనాస్ తదితర మందులను పిచికారీ చేయించాం. పంటలు రికవరీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం.
– కె.శ్రీదేవి, ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త
రైతులు జాగ్రత్తలు పాటించాలి
తెలంగాణలో మిర్చి అధికంగా సాగుచేసిన ఏడు జిల్లాల్లో పర్యటించాం. పురుగు తీవ్రత గత ఏడాది కన్నా తక్కువగా ఉంది. గత ఏడాది సన్నమిర్చి రకాలకు రాలేదు. కానీ ఇప్పుడు తేజ రకం విత్తనాలకు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించాం. దీనికి విరుగుడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో తయారు చేసిన కీటక నాశనులే అని ప్రయోగాల్లో తేలింది. రైతులు విత్తన శుద్ధి, పంట మార్పిడి మొదలైన సస్యరక్షణ చర్యలు కూడా పాటించాలి.
– లీలారాణి, సీఐపీఎంసీ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment