ఈశ్వరయ్య, కుడితెట్టి ఉపేందర్
గార్ల/భూపాలపల్లి రూరల్/నార్నూర్: పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు చివరికి ఆ రైతులనే కబళించాయి. పంటల దిగుబడి ఆశించిన మేర రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక మహబూబాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం పంచాయతీ వేదనాయక పురం గ్రామానికి చెందిన కుడితెట్టి ఉపేందర్(32) ఎకరంలో మిర్చితోట సాగు చేశాడు.
రూ.1.50 లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. పూత కాత రాక మిర్చి పంట ఎండిపోయింది. సోమవారం ఉదయం తోటకు వెళ్లి కంటనీరు పెట్టుకొని అప్పులెలా తీర్చాలని మధనపడుతుండగా ఉపేందర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు గార్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు న్నారు.
జయశంకర్ భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని కాసింపల్లికి చెందిన ఎల కంటి ఈశ్వరయ్య (45) తనకున్న మూడెక రాలలో మిర్చి సాగు చేశాడు. తామర పురుగు సోకడంతో దిగుబడి రాలేదు. పంటకు చేసిన రూ.4.50 లక్షలతోపాటు బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కుప్పలవడంతో మనస్తాపానికి గురై ఆదివారంరాత్రి తోటలోకి వెళ్లి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రమేశ్(40)తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి సరిగా రాలేదు. యాసంగిలో జొన్నపంట సాగు చేయగా, ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. పంటల సాగు కోసం రెండేళ్లలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. కూతురు పెళ్లికి ఎదగడం, వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో సోమవారం ఉదయం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌కు భార్య బిక్కుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment