
మిర్చి రైతుల పడిగాపులు
⇒ బస్తాలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్న సిబ్బంది
⇒ 15 వేల బస్తాలకు 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు
⇒ ఏప్రిల్ 2 వరకు మార్కెట్ బంద్
సాక్షి, మహబూబాబాద్: మిర్చి పంట ఈ సారి రైతాంగాన్ని చిన్నబుచ్చింది. గతేడాది మంచి ధర పలికిందని ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు మార్కెట్ అధికారుల తీరు వారిని మరింత కుంగదీస్తోంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వారంలో మూడు రోజులు(సోమ, మంగళ, బుధ) మాత్రమే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆదివారమే భారీగా మిర్చితో మార్కెట్‌కు చేరుకుంటుండడంతో యార్డ్ అంతా మిర్చి బస్తాలతో నిండి పోతోంది. రోజూ వందలకొద్దీ బస్తాలు మార్కెట్‌కు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ అధికారులు పేర్కొంటుండగా రైతులు మాత్రం సరుకు అమ్ముడుపోక రోజుల తరబడి మార్కెట్‌లోనే ఉండాల్సి వస్తోందంటున్నారు.
వాహనాలను అడ్డుకుంటున్న సిబ్బంది
రైతులు మార్కెట్‌కు మిర్చిని తీసుకొస్తే మార్కెట్ సిబ్బంది మూడు రోజులుగా అడ్డుకుంటున్నారు. గేట్‌కు తాళం వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వస్తున్న రైతులను లోపలికి రానివ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం నుంచి బుధవారం వరకు 15 వేల బస్తాలు మార్కెట్‌కు చేరుకోగా కేవలం 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు.
గిట్టుబాటూ దక్కడం లేదు..
నకిలీ విత్తనాలకు సరిగా దిగుబడిరాక ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతులను గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాకు గరిష్ట ధర రూ.7,400 నుంచి కనిష్ట ధర రూ.5,575 వరకు పలుకుతోంది.
ఏప్రిల్ 2 వరకు కొనుగోళ్లు బంద్
సోమవారం ప్రారంభమైన కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. వాస్తవానికి బుధవారంతోనే కొనుగోళ్లు ఆపాల్సి ఉన్నప్పటికీ మరో రెండు రోజులు మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని మార్కెట్ సిబ్బంది పేర్కొన్నారు. అందుకే కొత్తగా బస్తాలు తీసుకురావొద్దంటూ గేట్ వద్ద నుంచే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. వచ్చే శని, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉండడం వల్ల సోమవారం కూడా కొనుగోళ్లు చేయబోమని, మంగళ బుధవారాలు మార్కెట్‌కు ఉగాది సెలవు ప్రకటించినట్లు సిబ్బంది వెల్లడించారు. అందుకే ఏప్రిల్ 2 వరకు మిర్చిని కొత్తగా మార్కెట్‌కు తీసుకురావొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు.