నకిలీ విత్తనాలు అంటగట్టారు..
మోసపోయామని తెలుసుకుని
మొక్కలు తీసేస్తున్న రైతులు
అమరావతి: కౌలు తీసుకుని, అప్పులు చేసి మిరపసాగు చేస్తే..తీరా చెట్టు పెరిగి కాపునకు వచ్చేసరికి అవి నకిలీ అని తెలుసుకుని రైతులు తాము పెంచుకున్న మిరప మొక్కలను తామే తీసేశారు. వివరాలు..ఈ సంవత్సరం అత్తలూరు, శివారు గ్రామం నూతలపాటివారిపాలెంకు చెందిన 15మంది రైతులు 25ఎకరాలలో జీవా కంపెనీకి చెందిన జేసీహెచ్ 802 రకం హైబ్రీడ్ మిరప విత్తనాలను వేసి సాగు చేశారు. పెదకూరపాడు మండలంలోని త్రివేణి ఫెస్టిసైడ్స్ దుకాణం నుంచి ఈ విత్తనాలను తీసుకు వచ్చి నారుమళ్ళు పెంచి చేలలో నాటారు. సుమారు రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వేలరూపాయలు పెట్టుబడులు పెట్టి ఎరువులు, పురుగుమందులు వాడి తోటను పెంచారు. కాగా, కాపునకు వచ్చే సమయానికి తాము మోసపోయినట్లు తెలుసుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మిరపమొక్కలు నాటిన నుంచి ఆకుల నుంచి బంతిరావటం, పూతరాకపోవటం, కాయలు పైకిలేవటం, కాసినకాపు రాలిపోవటం, పూతకూడా నిలబడకపోవటంతో తొలుత సోమవారం దుకాణదారుని ఆశ్రయించగా సమాధానం కూడా సరిగా చెప్పలేదని రైతులు వాపోయారు. సమయం మించి పోతుండటంతో కొందరు రైతులు మంగళవారం తమ మిరపచేలను పీకి వేసి మరల ఖర్చు చేసి మిరప నారు నాటటానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. మరికొందరు రైతులు స్థానిక వ్యవసాయాధికారులను ఆశ్రయించారు. నకిలీ విత్తనాల కారణంగా ఎకరాకు సుమారు 30 నుంచి 40వేల వరకు నష్టం వస్తుందని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుని, పేద కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.