వత్తిలా కాలిపోతూ..
కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకున్న పత్తిపంట చిత్తవడంతో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించే రైతులను.. పురుగు మందు రూపంలో మృత్యువు తన పొత్తిళ్లలోకి లాగేసుకుంటోంది. పంటలు పాడవడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇంతవరకు మైదాన ప్రాంతాల్లో జరిగే విషాద కర సంఘటనలు అనుకుంటే.. ఆ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతానికి కూడా వచ్చేసింది. గిరిజన రైతులను సైతం పురుగు మందు రూపంలో మృత్యువు తన ఒడిలో చేర్చు కుంటోంది.
పార్వతీపురం: పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని కొమరాడ మండలం గిరిశిఖర గ్రామాలలో సంప్రదాయ పంటలను మాత్రమే పండించే గిరిజనులను సైతం షావుకార్లు పత్తి పంటల సాగుపట్ల ప్రోత్సహిస్తున్నారు. ఇంతవరకు మైదాన ప్రాంతాలకే పరిమితం అయిన పత్తిపంటలు గత మూడేళ్లుగా సబ్-ప్లాన్‌లోని కొండలెక్కేశాయి. విత్తనాలు మొదలుకొని పంట చివరి దశ వరకు అవసరమైన పురుగుమందుల వరకు షావుకారు వద్ద అప్పులు తీసుకున్న గిరిజనులు ఈ ఏడాది పత్తిని సాగు చేశారు. అయితే మహ మ్మారి హుద్‌హుద్ తుపాను వారి పంటలపై రాకాసి గద్దలా వాలి నాశనం చేసింది. ఈ కారణంగా పత్తి పంట నాశనం కాగా, సాగు కోసం చేసిన అప్పుల బాధలు వెంటాడుతున్నాయి.
ఓ వైపు ప్రభుత్వం ఆదుకోకపోవడం, మరోవైపు అప్పులు తీరే దాని కానరాక పోవడంతో.. గిరిపుత్రులు ఉసురు తీసుకుంటున్నారు. మొన్న కొరిశిల గిరిజనుడు చంద్ర పాత్రుడు, నిన్న జల గిరిజనుడు కడ్రక వేమన్నలు పత్తి పంట అప్పుల బాధలు వేగలేక పత్తికి వేసే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమరాడ మండలం జల గ్రామంలో పత్తిపంట పోయి, అప్పుల బాధలు పడలేక శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కడ్రక వేమన్న(30) కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మండంగి సోములు, ప్రసాద్, కడ్రక మోహన్ తదితరులు ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులకు, విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి...
పత్తి పంట పోయిందనే ఆత్మహత్య...!
జల గ్రామానికి చెందిన కడ్రక వేమన్న (30) పోడు వ్యవసాయంలో భాగంగా నాలుగెకరాలలో పత్తి పంటను సాగు చేశాడు. దీని కోసం తమ గ్రామానికొచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అరువు ఇచ్చే షావుకారు వద్ద సుమారు రూ.60వేల వరకు అప్పుపడ్డాడు. పంట చేతికొస్తుంది, అప్పు తీర్చేసి, మిగిలిన ఆదాయంతో తన ముగ్గురి కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయాలని ఆశపడిన వేమన్న పత్తిపంట మీదికి రాకాసి పిట్ట హుద్‌హుద్ తుపాను వచ్చి పడింది. దీంతో గ్రామంలో పత్తి పంట సాగు చేస్తున్న సుమారు 20 మంది గిరిజనులతోపాటు వేమన్న పంట కూడా నాశనమయ్యింది. ఈ నేపథ్యంలో పంట చేతికిరాకపోగా, ప్రభుత్వ సర్వేలు గిరిశిఖరాలకు ఎక్కలేకపోవడంతో, షావుకారు అప్పు తీర్చేందుకు వేమన్నకు మార్గం కనిపించలేదు.
దీంతో ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు భార్య చంటమ్మ, ముగ్గురు కొడుకులు పన్నెండేళ్ల సంతోష్, నాలుగేళ్ల రంజిత్, ఏడాది వినీత్‌ల భారం వేమన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నేపథ్యంలో వేమన్న మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారాడు. అప్పు తీర్చే సమయం, ఒత్తిడి అధికం కావడంతో ఏం చేయాలో తెలియక గ్రామమంతా శనివారం వారపు సంతకు వెళ్లడంతో అదే అదునుగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతనుంచి ఇంటికి వచ్చి చూసిన కుటుంబీకులు విగతజీవిగా పడి ఉన్న వేమన్న కనిపించాడు. వారు వెంటనే కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే వేమన్న ఊపిరి వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కొమరాడ ఎస్సై జె.ధర్మేంద్ర కేసునమోదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి పంట పోయిందనే బాధలో ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశామన్నారు. వేమన్న చనిపోవడంతో అనాథలైన కుటుంబసభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.