
సాక్షి, వరంగల్ రూరల్, స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర రూ.14 వేలు పలికింది. మార్కెట్‌కు ఒకే రోజు 1,500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. రూ.14 వేలు పలికి ఆల్‌టైం రికార్డుగా నమోదైంది. పత్తి క్వింటాల్‌కు రూ.14 వేలు ఇస్తామని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు, ఈధరతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైతు హర్షం వ్యక్తం చేశాడు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.13,500 పలికింది. కనిష్టంగా రూ.10,500 ధర పలికింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 4 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు తీసుకురాగా.. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బివి రాహుల్ మాట్లాడుతూ.. పత్తి పంట సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమై మే నెలలో కొనుగోళ్లకు చివరి నెల అని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని అన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచిన రైతులు అధిక డిమాండ్‌ను ఉపయోగించుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment