పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
కేసముద్రం, న్యూస్‌లైన్: గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో ఇంట్లో దాచుకున్న పత్తి ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది. ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైంది. వివరాలు.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వీరన్నకు కుమారుడు విక్కి(3)తో పాటు పది రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు.
కుమార్తె సుజాతకు.. కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా, సుజాత తన పిల్లలతో ఆదివారం తల్లిగారింటికి వచ్చింది. సోమవారం యూదమ్మ, సుజాత, వీరన్న కలిసి మహబూబాబాద్ వెళ్లారు. వెంకటయ్య గ్రామంలోకి వెళ్లాడు. సుజాత, వీరన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాము ఇంట్లో టీవీ చూసి పడుకుంటామని సుజాత కుమారుడు వేణు తలుపుపెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వెంకటయ్య తిరిగి ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి పత్తిని తొలగించి చూడగా ముగ్గురు పిల్లలు శవాలై కనిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.