ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటనే సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాగు విస్తీర్ణం అంచనా ప్రకారం.. గతేడాది కంటే ఈ ఏడాది కొంత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది గులాబీరంగు పురుగు ఉధృతి, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొదట్లో వర్షాలు కురిసినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రాలేని పరిస్థితి ఎదురైంది. కొంతమంది రైతులు గులాబీపురుగు ఉధృతితో పత్తి పంటను ముందుగానే తొలగించారు. ఈ దశలో మరోసారి పత్తి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు ఆ దిశగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలుస్తోంది.
65శాతం పత్తినే..
జిల్లాలో అధిక శాతం మంది రైతులు పత్తివైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు ఉంది. అయితే ఇందులో పత్తి పంట గతేడాది 1లక్ష 30వేల హెక్టార్ల వరకు సాగు కాగా, ఈసారి మరో 10వేల హెక్టార్లు అధికంగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. పత్తి తర్వాత 30వేల హెక్టార్లలో సోయాబీన్, 20వేల హెక్టార్లలో కంది సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు 8 లక్షలు అవసరం ఉండగా, 14లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్నారు. ప్యాకెట్ ధర రూ.730 ఉంటుందని పేర్కొన్నారు.
వరుణుడి కరుణ కోసం ఎదురుచూపు
గతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కూడా భారీగా వర్షాలు కురువడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. జూన్ మొదటి, రెండో వారంలోనే విత్తనాలు వేశారు. అయితే ఈసారి జూన్ మొదటి వారం గడిచినా వర్షం జాడలేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పినా మరో వారం రోజులపాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భా రీ వర్షాలు కురిస్తే తప్పా చిరుజల్లులకు విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు సూచి స్తున్నారు. గతంలో పలుసార్లు తొలకరి వర్షాలు కురువగానే పత్తి విత్తనాలను వేయడం, ఆ తర్వా త వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో విత్తనం మాడిపోయి నష్టాలు చవిచూశారు. ఒకటికి రెండుసార్లు కూడా విత్తనాలు వేసిన పరిస్థి తి ఎదురైంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రైతుకు రూ.4వేల చొప్పున మేలోనే రైతులకు చెక్కుల రూపంలో అందించిన విషయం విధితమే. ఈసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా 10శాతం మంది రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ అయినట్లు కనిపించడం లేదు. పెట్టుబడి సాయం త్వరగా అందిస్తే దళారులను ఆశ్రయించకుండా పెట్టుబడి కోసం వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
నకిలీ విత్తనాలతో జాగ్రత్త..
ఏటా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతూనే ఉన్నారు. ఈసారి కూడా జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో నకిలీ విత్తనాలు, బీటీ–3 పేరిట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నకిలీ విత్తనాల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో మరోమారు మోసపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది కొంతమంది రైతులు నకిలీ విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి రాక అవస్థలు పడ్డారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా ఎకరానికి ఒకట్రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాలేని దుస్థితి ఎదురైంది.
పత్తి వైపే మొగ్గు..
Published Fri, Jun 7 2019 7:55 AM | Last Updated on Fri, Jun 7 2019 7:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment