నిరాశపరిచిన మద్దతు ధర
గజ్వేల్: తీవ్ర వర్షాభావం... పంటలన్నీ ఆగమైపోయాయి. ఏం చేయాలో తెలియని మెతుకుసీమ రైతన్న కాస్తాకూస్తో చేతికందనున్న తెల్ల‘బంగారం’పై ఆశలు పెట్టుకున్నాడు. జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తిపంట మరోవారం రోజుల తర్వాత మార్కెట్ బాట పట్టే అవకాశముంది. అయితే మిగతా పంటలన్నీ కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయిన రైతన్నను ఆదుకోవాల్సిన అధికార యంత్రాగం గిట్టుబాటు ధర అందించే విషయంలో పిసినారి తనం చూపించింది.
గతేడాది ఇబ్బడిముబ్బడిగా నిల్వలున్నా సీసీఐ కేంద్రాలు సక్రమంగా నడవక రైతులు వ్యాపారులను ఆశ్రయించి అతితక్కువ ధరకు తమ ఉత్పత్తులను తెగనమ్ముకున్నారు. ధర రూపేణా కోట్లల్లో నష్టం జరిగింది. ఈసారైనా చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ‘గిట్టుబాటు’ అందించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రతికూలంలోనూ...పత్తిపై మమకారం
మెదక్ జిల్లాలో ఈసారి పత్తి 1.25 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు ఈ పంటపై ‘మమకారం’ ప్రదర్శించారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేకపోవడంవల్ల ఈ పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్కోరైతు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు చెడగొట్టి వేసుకోవాల్సి వచ్చింది. విత్తనాలు, ఇతర పెట్టుబడులు రూపంలో అప్పటికే కోట్లల్లో నష్టం జరిగిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్, ప్రస్తుత అక్టోబర్‌లోనూ ఈ పంటకు అనుకూలమైన వర్షాలు కురవలేదు.
ఫలితంగా జిల్లావ్యాప్తంగా పంట దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపింది. చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ఈసారి ‘గిట్టుబాటు’ దక్కుతుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో వారం రోజుల తర్వాత ఉత్పత్తులు మార్కెట్ బాటపట్టే అవకాశముండగా, అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు చేపడితే తప్ప రైతులకు లాభం జరిగే అవకాశం లేదు. ఈసారి మద్దతు ధరను రైతులు రూ.5 వేల వరకు ఆశిస్తే ప్రభుత్వం గతేడాది ఉన్న మద్దతు ధర రూ.3,700 నుంచి రూ. 4,000 స్వల్పంగా మరో రూ.50 మాత్రమే పెంచింది. ఈ లెక్కన ఈసారి రూ.3,750 నుంచి రూ.4,050 ధర వర్తిస్తుంది. గతేడాది చోటుచేసుకున్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కొనుగోళ్లు జరపడంతో పాటు గిట్టుబాటుధర అందించాలని రైతులు కోరుతున్నారు.
గతేడాది ఇలా..
గతేడాది జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగైంది. అయితే అధికారులు జిల్లాలోని గజ్వేల్, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.4,000 కూడా రైతులకు ఎక్కడా అందలేదు. సీసీఐ నిర్ణయాన్ని అదునుగా భావించిన వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు. రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని ట్రేడర్లు అత్యల్పంగా రూ. 3,500 నుంచి రూ.3,800 వరకు మాత్రమే పత్తికి చెల్లించారు. నామమాత్రంగా కొన్ని రోజులు రూ. 4 వేల పైచిలుకు ధరను అందించారు.
సీసీఐ కమర్షియల్ పర్చేజ్‌కు దిగితేనే మేలు
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ మార్కెట్‌లో అధిక రేటు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో, సీసీఐ స్పందించి వ్యాపారులకు ధీటుగా కమర్షియల్ దిగాల్సిన అవసరముంది. 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మార్కెట్‌లో ఇదే రకమైన పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో మద్దతు ధరతో ప్రమేయం లేకుండా సీసీఐ కూడా కమర్షియల్ పర్చేజ్‌కు దిగింది. సీసీఐ అప్పట్లో క్వింటాలుకు గరిష్ఠంగా రూ.6,900 వరకు రైతులకు చెల్లించింది. ఈసారి కూడా అదే తరహాలో స్పందిస్తే రైతన్నలకు ప్రయోజనం కలిగే అవకాశముంది.
పానమంతా పత్తిమీదే
Published Sat, Oct 11 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement