మధిర, న్యూస్లైన్ : తుపానుతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పత్తి కొనే నాథుడు లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.60 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 2.55 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అయితే వర్షానికి ముందు తీసిన పత్తిని కూడా సీసీఐ వారు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం నేటికీ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారుల ‘పంట’ పండుతోంది. కాస్తోకూస్తో చేతికొచ్చిన పత్తిని గత్యంతరం లేక రైతులు దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉందని, పత్తి నల్లగా ఉందనే సాకు చూపి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరిగేవి. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క యార్డులోకూడా సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు.
నష్టాల ఊబిలో రైతులు...
ఈ ఏడాది పత్తి ఎర్రబారిపోవడంతో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ. 3000 నుంచి 3200 వరకు విక్రయించాల్సి వస్తోందని, ఇది తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రూ.4 వేల వరకు ధర లభించేందని అంటున్నారు. దీనికి తోడు ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, తమ పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటివరకూ ఏ పంటా చేతికి రాకపోవడం, వచ్చిన పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్నామని చెపుతున్నారు.
ప్రభుత్వానికీ తగ్గుతున్న ఆదాయం...
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడంతో గత ఏడాది మార్కెటింగ్ శాఖకు రూ.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలోనూ గండి పడుతోంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వారు ఇంకా సీసీఐ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తమ చేతుల్లోంచి పంటలు వ్యాపారుల వద్దకు వెళ్లాక ధర పెంచుతారా అని అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలను ప్రారంభించడంతోపాటు మద్దతు ధర కల్పించాలని, తడిసిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
త్వరలో ప్రారంభం కావచ్చు
జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బహుశా వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం కావచ్చు. జిల్లాలో 13 మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. కొనుగోళ్లపై మాకు స్పష్టమైన సమాచారం లేదు.
- పంతంగి లక్ష్మణ్, ఏడీఎం
కొను‘గోల్మాల్’
Published Mon, Nov 4 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement