తాండూరు రూరల్/బంట్వారం, న్యూస్‌లైన్: అయ్యో.. ఎంత దా‘రుణం’..? దీపావళి శోభ సంతరించుకోవాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. ఇటీవ లి తుపానుకు కోలుకోని విధంగా పంటనష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కలత చెందిన ఆ అన్నదాత పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది తనకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాల నిమిత్తం బుచ్చిరెడ్డి దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఇటీవలి తుపానుకు పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నది. మొక్కజొన్న పాడైపోయింది.
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతు తీవ్ర కలత చెందాడు. తరచూ కుటుంబీకులు, స్థానికులతో వాపోతూ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కూతుళ్లు స్థానికులకు చెప్పారు. వెంటనే 108 వాహనంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి కొద్దిసేపటికే బుచ్చిరెడ్డి ప్రాణం పోయింది. ‘అప్పులే నా మొగుడి ప్రాణాలు తీసుకున్నాయి.. తుపాను రాకుంటే పంట బాగా పండేది.. అప్పులు తీరేవి.., నా భర్త పురుగుమందు తాగకుంటుండే..’ అని మృతుడి భార్య రుక్మిణి రోదించిన తీరు హృదయ విదారకం. బుచ్చిరెడ్డికి కూతుళ్లు కీర్తన(8), దీప (7) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రైతు మృతితో కుటుంబం వీధిన పడిందని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బుచ్చిరెడ్డి మృతితో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి.