ఖమ్మం వ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనతో జిల్లా వ్యాప్తం గా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన వర్షం అర్ధరాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ వర్షం ద్రోణిగా మారి విస్తారంగా కురిసే అ వకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతోం ది. ఈ వర్షం పలు ప్రాంతాల్లో మొలకెత్తిన పత్తి పైరుకు ఎంతో ఉపయోగం కాగా, కొద్ది రోజుల క్రితం నాటిన పత్తి మొలకెత్తే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 1,62,402 హెక్టార్లు కాగా 1,33,337 హెక్టార్లలో విత్తనాలు వేశారు. ఇందులో సగానికి పైగా మొదట వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి కూడా వేశారు. జూలై చి వరి వరకు పత్తి వేసే అవకాశం ఉండటంతో సాలు పత్తి వేసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్ చెపుతున్నారు. ఈ వర్షాలతో మొలకెత్తిన పత్తి చేలలో పాటు చేసుకునే అవకాశం ఉంది. భూమి పదునెక్కి ఉంటుంది గనుక నత్రజని, పొటాష్ ఎరువులు వేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జూలై చివరి వారంలో వర్షాలు కురుస్తుండటంతో స్వల్పకాలిక వరి రకాల నార్లను పోయటానికి అనుకూలమని వ్యవసాయాధికారులు అంటున్నారు.
నార్లు పోసేందుకు రైతులు సన్నద్ధం..
జిల్లాలో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉండటంతో ఆ నది పరీవాహక ప్రాంతంలో వివిధ రకాలు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. అంతేగాక ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగే అవకాశం కూడా ఉంది. తాలిపేరు ప్రాజెక్టులో నీరు నిండటంతో ఆ ప్రాజెక్టు ఆయకట్టులో వరినాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కాగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న పైర్లకు మేలు చేకూరుస్తుందని రైతులు అంటున్నారు.
వచ్చేనెలలో వరుణుడిపై ఆశలు..
జూన్‌లో సాధారణ వర్షపాతం 132 మి.మీలు కాగా కేవలం 30 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది. జూలైలో సాధారణ వర్షపాతం 314 మి.మీలు కాగా గత వారం వరకు 119 మి.మీ వర్షపాతం నమోదయింది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరో 30 మి.మీ వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వర్షాలకు తోడు వచ్చేనెలలో మరింతగా వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ కూడా ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
జిల్లాలో వర్షపాతం వివరాలిలా ..
జిల్లాలో ఆదివారం సగటున 17.5 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా టేకులపల్లి మండలంలో 38.2, కల్లూరు మండలంలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. 20 మండలాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా, 10 మండలాల్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బోనకల్లు, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో 5 మిల్లీ మీటర్ల కన్నా తక్కువగా నమోదయింది.
వర్షం..హర్షం..
Published Mon, Jul 28 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement