పత్తిలో గుడ్డిపూలు నివారించుకోండి
అనంతపురం అగ్రికల్చర్ : పత్తిలో గుడ్డిపూలు గుర్తించి నివారించుకుంటే మంచిదని, ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రెండు మూడు దశల్లో 28,885 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిపంట సాగు చేశారని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. పంట ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల వయస్సులో ఉందని, ఈ దశలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ప్రమాదకరమైన గులాబీ రంగు పురుగుతోపాటు మిగతా చీడపీడలు, తెగుళ్లు వ్యాపించకుండా నివారించుకోవచ్చన్నారు.
గుడ్డిపూలు గుర్తించడం ఇలా: గతేడాది పత్తిపంటకు నవంబర్‌లో గులాబీరంగు పురుగు గుర్తించడంతో అప్పటికే పంట బాగా దెబ్బతినడంతో రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది. దీంతో ఈ ఏడాది శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపట్టి రైతులను అప్రమత్తం చేశారు. ఇటీవల శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పంట పొలాల పరిశీలనలో గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం డివిజన్ల పరిధిలో గులాబీరంగు పురుగు ఉనికికి గుర్తించారన్నారు. పంట పొలాల్లో గుడ్డి పూలు ఉన్నట్లు కనిపించాయి. గుడ్డి పూలను రైతులు గుర్తించేలా అవగాహన ఉంటే తొలిదశలోనే పంట దెబ్బతినకుండా నివారించుకోవచ్చు. గొంగలి పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చి పూత, కాయ లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది.
నివారణ చర్యలు:
ఎకరా పొలంలో నాలుగు నుంచి ఎనిమిది చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వరుసగా మూడు రోజుల పాటు ఒక్కో బుట్టలో ఎనిమిది పురుగులు కనిపించినా, పది పువ్వులో ఒక గుడ్డిపువ్వు ఉన్నట్లు గుర్తించినా, ఇరవై కాయలను కోస్తే అందులో రెండు గొంగలి పురుగులు కనిపించినా గులాబీరంగు పురుగు ఆశించినట్లు తెలుసుకోవాలి. అలాగే కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం కనిపించినా, కాయ తొనల మధ్య గోడలపై గుండ్రంటి రంఘం ఉన్నా, గుత్తి పత్తి, రంగు మారిన పత్తి కనిపించినా పురుగు ఉధృతి ఉన్నట్లే లెక్క. గుడ్డిపూలు, రంగుమారినవి, రంధ్రాలున్న కాయలను ఏరివేసి నాశనం చేయాలి. పూత సమయంలో ఎకరానికి 60 వేల చొప్పున ట్రైకోగామా పరాన్నజీవులను వదలడం వల్ల పురుగు గ్రుడ్లను సమూలంగా నివారించుకోవచ్చు. ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.