సాక్షి, కొత్తగూడెం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తిరైతు చిత్తయ్యాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పత్తి పంటపై తుపాను ప్రభావం చూపింది. దాదాపు అన్ని మండలాల్లో ఈపంటకు నష్టం కలగగా అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రతిరోజు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుండటమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుత వర్షాలకు తొలివిడత తీస్తున్న పత్తి ముద్దవుతుండగా, మలివిడతపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. రోజూ వర్షం పడుతుండటంతో రైతులు కూలీలతో పత్తి తీయించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కూడా పత్తి చేతికందే సమయంలో నీలం తుపాను సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తుతం రైతులు గుర్తుచేసుకుంటున్నారు. నీలం తుపాను దెబ్బకు అప్పట్లో సాగుచేసిన పత్తి పూర్తిగా చేతికందకుండా పోయింది.
అంత నష్టం జరిగినా... ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరిశీలించినా ఇప్పటికీ బాధిత రైతులకు నష్టపరిహారం అందలేదు. మళ్లీ ఈ ఏడాది ప్రకృతి పగపట్టిందని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం ఈ వర్షం వల్ల పంటలకు ఎలాంటి నష్టం లేదని, లాభమేనని పేర్కొనడం గమనార్హం. తొలిదశ పత్తి ముద్దయి కారుతున్నా వ్యవసాయ శాఖ అధికారులకు నష్టం కన్పించకపోవడం విచిత్రం. గురువారం జిల్లా మొత్తం 44.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అన్ని మండలాల్లో సగటున 9.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రధానంగా వెంకటాపురం, పినపాక మండలాల్లో 3సెంటీ మీటర్లకు పైగా, ఎర్రుపాలెం, బోనకల్లు, ముదిగొండ, చర్ల మండలాల్లో 2సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, వేలేరుపాడుల్లో అత్యల్పంగా వర్షం కురిసింది.
జిల్లాలో వర్షం కారణంగా
నష్టాన్ని పరిశీలిస్తే...
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం కలిగింది. నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో 37,500 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 25 వేల ఎకరాలలో, తిరుమలాయపాలెం మండలంలో 50 వేల ఎకరాలలో, నేలకొండపల్లి మండలంలో 12,500 ఎకరాలలో వేసిన పత్తి పంట దాదా పు ఈ వర్షానికి 80 శాతం పైగా దెబ్బతింది. ప్రస్తుతం మొదటి దశ పత్తి తీసే సమయం లో వచ్చిన వర్షం రైతులను నట్టేట ముంచిం ది. వరుస వానలతో పత్తి చేలల్లో నీరు చేరడంతో చేలన్నీ ఎర్రగా మారాయి. ఒక్కసారి కూడా పత్తి తీయకపోవడంతో ఈ వర్షానికి చేలల్లోనే పత్తి మొలకెత్తే పరిస్థితి నెలకొంది.
అశ్వారావుపేట మండలంలో 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వర్షాల కారణంగా పూత రాలిపోయి, కాయలు నల్లబడిన కారణంగా రెండు తీతలు (కోతలు) పూర్తిగా రైతులు నష్టపోయారు. చంద్రుగొండ మండలంలో పత్తి 13 వేల ఎకరాల్లో సాగవుతుండగా మొత్తం తొలిదశ పత్తి తీస్తుండగా వర్షంతో నష్టం వాటిల్లింది. ములకలపల్లి మండలంలో 2500 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా అధిక శాతం పత్తిపంట నష్టం వాటిల్లే అవకాశముంది.
ఖమ్మం అర్బన్ మండలంలోని పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, మల్లేపల్లి, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, చాపరాలపల్లి, శివాయిగూడెంలలో సుమారు 20 వేల ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నారు. తొలిదశ పత్తి తీసే సమ యంలో వర్షం రావడంతో పత్తి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి రైతు చిత్తు
Published Fri, Oct 25 2013 3:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement