కన్నీటి కష్టం
ఖరీఫ్ ఆరంభంలోనే కర్షకుడికి కన్నీటి కష్టమొచ్చింది. వరుణ దేవుణ్ని నమ్ముకుని మూడెకరాల్లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోతుంటే, దాన్ని కాపాడుకునేందుకు గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన రైతు కంబరి హనుమంతు అష్టకష్టాలుపడుతున్నాడు. భార్య నగలు తాకట్టు పెట్టి పంట పెట్టుబడులు సమకూర్చుకున్నాడు. 12 ప్యాకెట్ల విత్తనాలను నాటగా.. మొలకెత్తగానే వరుణుడు ముఖం చాటేశాడు.
పంట ఎండుముఖం పడుతోందనే ఆందోళనతో ఐదు రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి భగీరథ యత్నం చేస్తున్నాడు. సమీపంలోని రంగచేడు కాలువలో నిలిచిన వర్షపు నీటిని కావడితో మోస్తూ మొలకలపై చల్లుతున్నారు. ‘రూ.30 వేల వరకు పంట పెట్టుబడి పెట్టా. మూడు నాలుగు రోజుల్లో వర్షం కురవకపోతే తీరని నష్టం తప్పదు. గతంలో ఐదు బోర్లు తవ్వించినా నీరు పడలేదు. దీంతో అప్పుల పాలయ్యా. ఈ కష్టం ఏ రైతుకూ వద్ద’ని కంబరి హనుమంతు అన్నారు.
- ఫొటోలు : ఈ. రాధాకృష్ణ, గుమ్మఘట్ట