ఇంత మోసమా..! | YS jagan mohan reddy slams chandra babu ruling | Sakshi
Sakshi News home page

ఇంత మోసమా..!

Published Fri, Sep 26 2014 2:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

ఇంత మోసమా..! - Sakshi

ఇంత మోసమా..!

వైఎస్ జగన్ ఎదుట బాబుకు శాపనార్థాలు పెట్టిన డ్వాక్రా మహిళలు
వేల్పులలో పత్తి పంటను పరిశీలించిన జగన్
పండుటాకులకు ఆప్యాయ పలకరింపు
రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోమని హెచ్చరిక
ప్రతిపక్షనేతతో జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే, మేయర్ చర్చలు
పులివెందులలో అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
రెండు రోజుల పర్యటన విజయవంతం
కడప సాక్షి/పులివెందుల/టౌన్/వేముల : ‘ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వంచిస్తున్నాడు.. బ్యాంకోళ్లేమో వడ్డీకి వడ్డీ రాబడుతున్నారు.. నాలుగు నెలల కంతు ఒకేసారి కడితే మొత్తమంతా వడ్డీకే సరిపోయింది.. అసలుకు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలో తెలియడం లేదు.. చంద్రబాబు ఇంత మోసగాడని తెలియదు’.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట డ్వాక్రా మహిళలు అన్న మాటలు ఇవి.   హామీలు ఇచ్చి విస్మరించడం కాదు.. ఇచ్చి నెరవేర్చేవాడే నాయకుడు అని జగన్ వారికి స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో డ్వాక్రా మహిళలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ... కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలంతా చంద్రబాబు పాలనను ఎండగడుతూ తమకు జరుగుతున్న  అన్యాయాన్ని  చెప్పుకుని  ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని.. అప్పటివరకు ఎవరు రుణాలను చెల్లించవద్దని కల్లబొల్లి  మాటలు చెప్పి మోసం చేశారంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
 
పండుటాకులకు పలకరింపు.. :
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వైఎస్ జగన్ కోసం వందల సంఖ్యలో కూర్చొన్న అవ్వ.. తాతలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వృద్ధులను చూసిన వైఎస్ జగన్ వారి వద్దకు నేరుగా వెళ్లి బుగ్గలు నిమురుతూ అవ్వా అంటూ ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు. వారు కూడా వైఎస్ జగన్‌తో తమ కష్టనష్టాలను వెల్లబోసుకున్నారు.  వైఎస్‌ఆర్ హయాం నుంచి పింఛన్ వస్తోందని..  అనర్హుల పేరుతో తమ పింఛన్లను తొలగించేందుకు  చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.
 
ట్రిపుల్ ఐటీలో ఎలెక్ట్రిషియన్లకు జీతాలు పెంచండి

రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్న ఎలక్ట్రిషియన్లు,  ఫ్లంబర్స్ జీతాలు పెంచాలని  వైఎస్ జగన్‌రెడ్డి ఓఎస్డీని ఆదేశించారు.  ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న కొంతమంది ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్లు  వచ్చి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.  ట్రిపుల్ ఐటీలో ఆరంభం నుంచి పనిచేస్తున్న తమకు సంబంధించి ఇప్పటివరకు రూ. 7,100లు జీతం ఇస్తున్నారని.. జేఎన్‌టీయూ, యోగి వేమన యూనివర్శిటీల పరిధిలోని ఇదే సిబ్బందికి రూ. 10,900లు ఇస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ట్రిపుల్ ఐటీల ఓఎస్డీ నితిన్‌తో టెలిఫోన్‌లో చర్చించారు.
 
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు

ఆర్టీపీపీలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులతోపాటు ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను కలిశారు. క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్టీపీపీ ఉద్యోగులు  వేతన సవరణ వెంటనే చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకరావాలని  కోరారు. ఉద్యోగుల వేతన సవరణ చట్టాన్ని తెలంగాణాలో చేపట్టారని.. ఏపీలో ఇంకా చేపట్టలేదని పేర్కొనగా. అసెంబ్లీలో చర్చిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.
 
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆయన సోదరుడు ఆకేపాటి మురళీధర్‌రెడ్డి, జిల్లా మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తదితరులు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు.
 
బెంజిమన్ కుటుంబానికి పరామర్శ :
పులివెందులలోని బాకరాపురంలో నివసిస్తున్న బెంజిమన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంజిమన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు.
 
అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
పులివెందులలోని అమ్మవారిశాలలో దసరా ఉత్సవాలను పురష్కరించుకుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి తొలిరోజు వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్ ఆలయం వద్దకు రాగానే పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ సమీపంలోనే మీనాక్షి అలంకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతోపాటు అద్దాల మండపాన్ని ై సందర్శించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను ఆర్యవైశ్యులు శాలువాలతో సన్మానించారు.
 
రెండు రోజుల పర్యటన విజయవంతం
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజులు వివిధ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన వైఎస్ జగన్‌రెడ్డి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లారు.
 
పంటలను పరిశీలించిన ప్రతిపక్షనేత
వేల్పుల గ్రామ సమీపంలోని భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద రైతు విశ్వనాథరెడ్డి సాగు చేసి వాడు దశలో ఉన్న పత్తి పంటను  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. వర్షాభావంతో పంట ఎదుగుదలలేక..  నడుముల ఎత్తు ఉండాల్సిన పత్తి పంట కేవలం జానెడు ఎత్తు మాత్రమే  ఉండటం  చూసి వైఎస్ జగన్ చలించిపోయారు.  అక్కడే అరటి గెల పట్టుకున్న రైతుతోపాటు విశ్వనాథరెడ్డితో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు.  ఏడీ జమ్మన్న, ఏవో చెన్నారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డిని అడిగి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.  వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, వేల్పుల సింగిల్‌విండో అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోం

వినియోగదారులకు సంబంధించి సక్రమంగా సరుకులు అందజేస్తున్నా..  చిన్న చిన్న కారణాలు చూపి  రేషన్ డీలర్లను తొలగించేలా చూస్తే ఊరుకునేది లేదని వైఎస్ జగన్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో చక్రాయపేట మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు వచ్చి వైఎస్ జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ పేదలకు రేషన్‌ను సక్రమంగా అందిస్తున్నా.. కుంటి సాకులతో ఇబ్బం దులు పెట్టాలని చూస్తే.. బాగుండదని  హెచ్చరించారు.  ఈ విషయంలో  న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడమని  తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement