ముందు మురిపించిన వానలు పత్తి పంట సాగు చేసేలా రైతులను ఊరించాయి. అధికారుల అంచనాలకు మించి ఈ సారి జిల్లాలో పత్తి సాగైంది.
ఊరించిన పత్తి .. ఉసురు తీస్తోంది. తెల్లబంగారం విలువైన ప్రాణాలు హరిస్తోంది. కేవలం రెండు
వారాల వ్యవధి.. పదకొండుమంది రైతుల బలవన్మరణం.. మహిళా.. మైనారిటీ.. గిరిజన.. కౌలు ..
ఇలా అన్ని విభాగాల రైతులు పురుగుల మందును ఆశ్రయించారు.. పంట నష్ట పరిహారంపై
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాక ఆందోళన చెందారు.. ప్రభుత్వ అధికారులు..
ప్రజాప్రతినిధులు.. వ్యవసాయ సంఘాలు.. ఏవీ అన్నదాతకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేయ
లేదు... ఫలితంగా పదకొండు కుంటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి..!!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ముందు మురిపించిన వానలు పత్తి పంట సాగు చేసేలా రైతులను ఊరించాయి. అధికారుల అంచనాలకు మించి ఈ సారి జిల్లాలో పత్తి సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం కన్నా ఇది రెట్టింపు కావడం విశేషం. తీరా పంట చేతికి వస్తుందనగా అయిదు రోజుల పాటు అతలాకుతలం చేసిన తుపాను అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తిపంట పూర్తిగా తడిచి, నల్లగా మారి పనికి రాకుండా అయ్యింది.
పంటల సాగు కోసం చేసిన అప్పులు భయపెట్టగా, ఆదుకునే వారు లేక అన్నదాతలు క్రిమిసంహారక మందును ఆశ్రయించారు. ఇలా, జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు, కేవలం పదమూడు రోజుల వ్యవధిలోనే దేవరకొండ, చండూరు, మునుగోడు, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, వలిగొండ, భువనగిరి, మఠంపల్లి మండలాల్లో ఎనిమిది మంది పత్తి రైతులు, తిప్పర్తి మండలంలో ఒక వరి రైతు బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాలో ఈ సారి 6,87,823 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే, ఇటీవల కురిసిన తుపాను వల్ల 3,80,283 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఇంతవరకే పరిగణనలోకి తీసుకున్నా 23.93లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి పోయినట్టే. తద్వారా రైతులు సుమారు రూ.1037కోట్ల ఆదాయం కోల్పోతున్నారు.
పంటల సాగు కోసం చేసిన పెట్టుబడులు అప్పులుగా మిగిలాయి. దీంతో ధైర్యం కోల్పోయిన పత్తి రైతులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. ఇక, వరి పంట విషయానికి వస్తే 3,61,156ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా, భారీ వర్షాల కారణంగా 92వేల ఎకరాల విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నది. ఫలితంగా 20.25లక్షల క్వింటాళ్ల దిగుబడిని పూర్తిగా నష్టపోయినట్టే. దీనివల్ల రమారమి రూ.300కోట్ల మేర రైతులు ఆదాయం కోల్పోతున్నారు. తిప్పర్తి మండలంలో వరి సాగుచేసిన ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా, ప్రభుత్వం ఇంకా అంచనాలు వేసే దశలోనే ఉంది. అధికార వర్గాల సమాచారం మేరకు శుక్రవారం పంట నష్టం అంచనాల కోసం పది కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అయితే, ఈ బృందాలు ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాయో మాత్రం ప్రకటించలేదు. పంట నష్టపోయిన రైతాంగానికి భరోసా కల్పించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించాల్సింది పోయి ఎవరి బిజీలో వారున్నారు.