ఖమ్మం వ్యవసాయం: ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుతున్న పత్తి పంటలో పిండినల్లి తెగులు వ్యాప్తిచెందుతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉందని డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. చెను చుట్టూ ఉండే పిచ్చి మొక్కల నుంచి పిండినల్లి పురుగులు పత్తిలోకి చేరుతుండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
తెగులు లక్షణాలు
పెద్ద, చిన్న పురుగులు పత్తి చెట్టు కాడలు, ఆకులు, గూడ, కాయలు, కాండం నుంచి రసం పీలుస్తాయి. ఫలితంగా ఈ భాగాలు వాడి రాలిపోతాయి. చెట్టు పెరుగుదల నిలిచిపోతుంది.
కాయలు సరిగా విచ్చుకోవు. విచ్చుకున్న కాయల్లోనూ గింజ నాణ్యత తగ్గుతుంది.
పిండినల్లి పురుగు విసర్జించే తేనెవంటి పదార్థం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది.
ఈ పురుగు ఆశించిన ప్రదేశాల్లో గండు చీమలు తేనె కోసం తిరగడం గమనించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉంటే పత్తి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇది అన్ని దశల్లోనూ సంభవించవచ్చు.
పిండినల్లి నివారణ-పంట యాజమాన్య పద్ధతులు
గతంలో వేసిన పంట తాలూకు అవశేషాలు పొలం నుంచి తొలగించి కాల్చివేయాలి. అలా చేయని పక్షంలో పిండినల్లి పురుగు ఈ అవశేషాల్లోనే ఉండి వేయబోయే పంటకూ వ్యాపిస్తుంది.
పొలం దున్నే సమయంలో చీమల పుట్టలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయాలి.
పొలం గట్లపై పిండినల్లి తెగులు ఆశించిన కలుపు ఉంటే పీకి నాశనం చేయాలి.
గట్లపై సాధమైనంతవరకు కలుపులేకుండా చూసుకోవాలి.
పిండి పురుగు ఆశించిన కొమ్మలు, మొక్కలు తొలగించి నాశనం చేయడం ద్వారా చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు.
{పారంభంలో ఈ తెగులు కొన్ని మొక్కలకే వ్యాపిస్తుంది. అప్పుడు ఈ పురుగు సముదాయాన్ని గుర్తించి గోనె పట్టాతో రుద్ది నాశనం చేయాలి.
జీవ సంబంధ పద్ధతులు
పిండినల్లి పురుగు జీవితచక్రంలో చాలా దశలు ఉన్నాయి. ఈ పురుగును ఆశించే సహజ శత్రువులు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బదనికలు. సహజసిద్ధంగా పిండినల్లి పురుగును ఆశించే ట్రిప్టోలిమస్ మాంట్రోజరి, సిర్ఫిడ్ ఈగలను రైతులు విధిగా రక్షించుకోవాలి. పిండినల్లి నివారణకు పురుగుమందులు వాడేటప్పుడు మేలు చేసే ఈగలకు హాని జరగకుండా తక్కువ డోసు ఉండే రసాయనిక మందునే ఉపయోగించాలి.
శిలీంద్రాలు: బవేరియా బాసియానా, వర్టిసిల్లియం లకాని ఫార్మలేషన్స్ వాడి పురుగు ఉధృతిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు.
రసాయనిక పద్ధతులు
మొదటిదశ పురుగులపై తెల్లని మైనం వంటి పదార్థం ఉండదు. ఈ దశలో కీటక నాశనులను పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఈ పిండి నల్లి పురుగు మొదట్లో కొన్ని మొక్కలనే ఆశిస్తుంది. ఆశించిన చెట్లు, చుట్టుపక్కల పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల పురుగు పక్క మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.
పురుగు ఉధృతి పెరిగినప్పుడు ప్రొఫెనోపాస్ మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు,మూడు పర్యాయాలూ స్ప్రే చేయాలి. పై మందులతో పాటు సర్ఫ్‌పౌడర్ 0.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.
పత్తిపంట ‘పిండి’పిండి
Published Fri, Aug 15 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement
Advertisement