ఖమ్మం వ్యవసాయం: మొక్కజొన్న పంటను జిల్లాలో 8,230 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కె.6, జె.ఎల్.24, ట్యాగ్-24 తదితర రకాలను వేశారు. జూన్, జులై నెలల్లో విత్తిన మొక్కజొన్నను కాండం తొలిచే పురుగు ఆశించింది. జింక్, భాస్వరం లోపాలు కూడా ఉన్నట్లు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణపై కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు.
కాండం తొలిచే పరుగు...
కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 10-20 రోజులకు పైరును ఆశిస్తుంది. పిల్లపురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తింటాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది వెడల్పు రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుసక్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని ఆశించటం వల్ల దిగుబడి తగ్గుతుంది.
నివారణ చర్యలు...
పొలంలో కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి.
పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
పొలం చుట్టూ 3-4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి.
అంతర్‌పంటలుగా అపరాలు (కంది, సోయాబీన్, బొబ్బర్లు) సాగు చేయడం వల్ల సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది.
మోనోక్రొటోఫాస్ 36 యస్.ఎల్ మందును ఎకరాకు 320 మి.లీ 200 లీటర్ల నీటికి కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారీ చేయాలి.
ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.
జింక్ లోపం..
జింక్ లోపం వల్ల ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. లేదా లేత పైరు తెల్లమొగ్గగా మారుతుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్‌ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంతగా తేమ ఉండాలి. మొదటి దఫా ఎరువులు వేసిన తర్వాత సాళ్లలోని మట్టిని మొక్కల మొదళ్లలోకి ఎగదోయాలి.
మొక్కజొన్న రైతులూ జాగ్రత్త
Published Tue, Aug 19 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement