
ప్రతీకాత్మక చిత్రం
జనగామ: రైతు బంధు పథకంలో మంజూరైన చెక్కు ఇవ్వడంలేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా అడవికేశ్వాపూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొడియాల జెన్నయ్యకు 11 ఎకరాల భూమి ఉంది.
గ్రామానికి చెందిన కొందరు తన భూమిని లాక్కుంటారనే భయంతో జెన్నయ్య కొద్ది రోజుల క్రితం కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. దీనిపై విచారణ పూర్తయినా అధికారులు చెక్కు ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన అతడు తన వ్యవసాయ బావి వద్ద కిరో సిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
చుట్టు పక్కల రైతులు అతడిని అడ్డుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకురాగా, అక్కడ గంట పాటు ధర్నా చేశారు. కోర్టు పరిధిలో కేసు నడుస్తున్న క్రమంలో చెక్కు ఇవ్వరాదని, అయినా ఆందోళన వద్దని తహసీల్దార్ చెప్పారు. కోర్టు సమస్య సద్దుమణిగిన తర్వాత చెక్కు అందజేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి జెన్నయ్య వెళ్లిపోయాడు.