సాక్షి, హైదరాబాద్ : వంద కాదు.. రెండొందలు కాదు.. అక్షరాలా 854 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆసామి ఆ రైతు! రైతుబంధు పథకం కింద ఆయనకు ఖరీఫ్‌లో అందించాల్సిన సొమ్ము ఎంతో తెలుసా? రూ.34.16 లక్షలు!! రబీలో మరో రూ.34.16 లక్షలు. అంటే ఏడాదికి ఏకంగా రూ.68.32 లక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఈ రైతు ఊరు, పేరును వ్యవసాయ వర్గాలు రహస్యంగా ఉంచాయి. ఆయనకు నిజంగా అంత భూమి ఉందా? లేదా ఎక్కడైనా పొరపాటు జరిగిందా? అని రికార్డులు తిరగేస్తున్నాయి. పక్కా సర్వే నంబర్, పట్టా భూమి కావడంతో ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి.
ప్రస్తుతానికైతే రైతుబంధు పథకం లబ్ధిదారుల తుది జాబితాలో ఈ రైతు వివరాలను తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. పథకం కింద పెట్టుబడి సొమ్మును అందజేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూప్రక్షాళన రికార్డుల సమాచారాన్ని రెవెన్యూ శాఖ ఇటీవల వ్యవసాయ శాఖకు అందజేసింది. ఆ సమాచారంతో రైతు వివరాలను, భూములను పరిశీలించి తుది జాబితా తయారు చేసేపనిలో ఆ శాఖ నిమగ్నమైంది. వ్యవసాయ భూములు కాని వాటిని తొలగిస్తోంది. ఇప్పటికే 80 శాతం పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు వద్ద 854 ఎకరాలున్న సంగతి వెలుగులోకి వచ్చింది.
సీలింగ్‌పై నిర్ణయమేది?
అధికారులు రూపొందిస్తున్న జాబితాల్లో వంద ఎకరాలకు మించిన వారు కూడా ఉన్నారు. అయితే భూసీలింగ్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ భూమి 50 ఎకరాలే ఉండాలి. అంతకుమించి ఉంటే అక్రమంగా ఉన్నట్టే! యాభై ఎకరాలకు మించి భూమి ఉన్న వారి విషయంలో సర్కారు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండ్రోజుల క్రితం విడుదల చేసిన రైతుబంధు పథకం మార్గదర్శకాల్లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అవేవీ పట్టించుకోకుండా అందరికీ ఇస్తున్నారు. అయితే ‘పెట్టుబడి పథకం సొమ్ము వదులుకోండి..’అని మాత్రమే పిలుపునిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట 37 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అనేకమంది ప్రజాప్రతినిధులకు మాత్రం సీలింగ్ యాక్ట్ కంటే అధికంగానే భూమి ఉన్నట్లు గుర్తించారు.
పెట్టుబడి వదులుకోండి.. ప్లీజ్!
‘పెట్టుబడి సొమ్ము వదులుకోండి..’అని పెద్దలకు పిలుపు ఇచ్చినా, స్వయానా తానే వదులుకుంటున్నట్లు సీఎం ప్రకటించినా ఇప్పటికీ అనేకమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి గ్రామసభల్లో ప్రారంభమయ్యే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెట్టుబడి సొమ్ము వదులుకునేలా హామీ పత్రాలను పంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అప్పటికప్పుడు సభలో వద్దనుకునే వారుంటే ఆయా పత్రాలపై హామీ సంతకం ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. సొమ్ము వదులుకునే వారి చెక్కులను నేరుగా రైతు కార్పొరేషన్ కార్పస్ ఫండ్ కింద జమచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment