రైతు మంగలి బిక్షపతి
చేవెళ్ల రంగారెడ్డి : అనారోగ్యంతోపాటు, వ్యవసాయంపై చేసిన అప్పలు బాధిస్తుండటంతో ఓ రైతు మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలంలోని చనువెల్లి గ్రామానికి చెందిన మంగలి బిక్షపతి (38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇతడు గత కొంతకాలంగా కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండటంతో భరించలేక రెండు మూడుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఉండటంతో ప్రమాదం జరగకుండా చూసుకున్నామని భార్య అనిత తెలిపారు. మళ్లీ ఈ సమస్య రావటంతో గురువారం రోజు మధ్యాహ్నం ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోనే కాసేపు పడుకున్నాడు.
అయినా బాధ ఎక్కువ కావటంతో భరించలేకపోయాడు. దీనికి తోడు పంటల కోసం చేసిన అప్పులు కూడా ఉండటంతో ఏం చేయాలో తెలియక రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలతో మాట్లాడి మళ్లీ వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఎక్కడా కనిపించ లేదు. అర్ధరాత్రి సమయంలో పొలాల వద్ద ఉన్నాడేమోనని వెళ్లి చూస్తే వేప చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవటంతో కుటుంసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య అనిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment