టీ.నగర్ : పసంగ పాండిరాజ్‌దర్శకత్వంలో కార్తి నటించిన కడైకుట్టి సింగం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం గురించి, ఇతరవిషయాల గురించివిలేకరులతో కార్తిమాట్లాడారు.
ప్రశ్న: కడైకుట్టి సింగం ఏ తరహా చిత్రం?
జ: దర్శకుడు పాండిరాజ్ మూడేళ్ల క్రితం ఈ కథను వివరించారు. అయితే, ఇరువురికి అవకాశం కుదరలేదు. ప్రస్తుతం సరైన సమ యం కుదిరింది. పెద్ద కుటుంబ కథా చిత్రం లో నటించాలన్న చిరకాల వాంఛ నెరవేరింది.
ప్రశ్న: చిత్రంలో మీ క్యారెక్టర్ గురించి?
జ: ఇది కుటుంబ కథాచిత్రం. నేను చదువును మధ్యలోనే అపేసి వ్యవసాయం చేసే క్యారెక్టర్‌లో నటించాను. సామాజిక విషయాలపై శ్రద్ధ కలిగిన రైతుగా నటించాను.
ప్రశ్న: ఈ చిత్రం కోసం ఎలా కష్టపడ్డారు?
జ: ‘ధీరన్ అధికారం ఒన్రు’ చిత్రం కోసం శరీర బరువును కష్టపడి తగ్గించుకున్నాను. ‘కడైకుట్టి’ చిత్రం కోసం మళ్లీ కష్టపడి బరువును పెంచుకున్నాను. నారు నాటడం, పాదులు కట్టడం వంటివి సక్రమంగా నేర్చుకుని నటించాను.
ప్రశ్న: రైతుల కోసం రూపొందిన చిత్రమా?
జ: ఒక రైతుకు ఉన్న యథార్థమైన సమస్యల గురించి ఈ చిత్రంలో ప్రశ్నించాం? మిగతా పనులకు విశ్రాంతి ఉన్నప్పటికీ వ్యవసాయానికి విశ్రాంతే లేదు. ఏ వయసులోనైనా వ్యవసాయం చేయవచ్చు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించేవాళ్లే రైతులు. ఈ జీవన సిద్ధాంతాన్ని మిగతా వారికి తెలియజేయాలి.
ప్రశ్న: తిరుమయంలో రెక్లా రేస్ అనుభవం ఎలావుంది?
జ: తిరుమయంలో రెక్లా రేస్ నిర్వహించే వారి ఆధారంగా పందెపు సన్నివేశాలు రూపొందించాం. గుర్రపు స్వారీ శిక్షణ పొందడంతో ఎడ్లబండి నడపడం కొంత సులభంగా అనిపించింది. ఎడ్ల బండిలో నేను మాత్రమే కూర్చునే వీలుంది. వెంట పరుగెత్తిన వ్యక్తి ఒక దశలో పరుగుతీయలేక నేను మాత్రమా ఎడ్లబండిలో వెళ్లి తిరిగి రావాల్సి వచ్చింది. అథ్లెటిక్స్‌లో ఎలా శిక్షణ పొందుతామో, అలాగే ఎడ్లబండి పందెంలో ఎద్దులకు శిక్షణ ఇస్తారు.
ప్రశ్న: చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎలా డీల్ చేశారు?
జ: ముగ్గురు హీరోయిన్ల విషయంలో నాకెలాంటి కష్టం కనిపించలేదు. అయితే డాన్స్ సీన్లలో కొంత శ్రమ అనిపించింది. నా కోసం వారు కొంత అడ్జెస్ట్ అయ్యారు.
ప్రశ్న:దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా?
జ: దర్శకులు పడే బాధలు నాకు బాగా తెలుసు. ఎందుకు ఆ రంగంలోకి దిగాలి? ప్రస్తుతానికి నటనపైనే దృష్టి ఉంచాను. 17వ చిత్రం నటించాను. దర్శకత్వం వహించే అలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి సిద్ధం. నాకు తోచింది దర్శకునికి చెబుతాను. దాన్ని అంగీకరించడం, లేకపోవడం వారిష్టం.
ప్రశ్న:తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు?
జ: కష్ట సుఖాలను సమానంగా చూడాలనే వంటి పలు విషయాలు తండ్రి నుంచి నేర్చుకోవచ్చు. వృత్తి పైన గౌరవం ఆయన నుంచి నేర్చుకున్నదే.
Comments
Please login to add a commentAdd a comment