
తన పొలంలో రోడ్డు పనులను అడ్డకున్న మీరా ప్రసాద్‌ను బలవంతంగా తరలిస్తున్న పోలీసులు
తుళ్లూరురూరల్ : రాజధాని అమరావతి ప్రాంతం రైతులకు తాత్కాలిక సచివాలయం సాక్షిగా అణచివేతకు గురవుతున్నారు. వెలగపూడికి చెందిన గద్దే మీరాప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు రైతును పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయారు.. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ రైతు మీరా ప్రసాద్ నిలదీశారు.
తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్‌డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరాప్రాద్ అనే రైతు భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్ విజయకుమారిని వివరణ కోరగా తాము పోలీసులకు భద్రత మాత్రమే కల్పించమని అడిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment