సాక్షి, అమరావతి : సచివాలయం సాక్షిగా ఏపీ రాజధానికి భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం కొనసాగుతోంది. భూములు ఇవ్వని రైతులను సీఆర్‌డీఏ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. సచివాలయం పక్కనే... రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు వేయడానికి సీఆర్‌డీఏ అధికారులు సిద్ధం అయ్యారు. వెలగపూడికి చెందిన గద్దే రైతు మీరా ప్రసాద్ తన పొలంలో రోడ్డు వేయడానికి యత్నించిన సీఆర్‌డీఏ అధికారుల యత్నాలను అడ్డుకున్నాడు. మీరా ప్రసాద్ ఈ సందర్భంగా అధికారులతో వాగ్వివాదాన్ని అడ్డుకున్నారు.
సీఆర్‌డీఏ అధికారులు రోజు ఫోన్ చేసి తన పొలంలో రోడ్డు వేస్తామని బెదిరిస్తున్నారని, రాజధానికి భూమి ఇవ్వనందుకు తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని మీరా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనకు ఏమైనా అయితే సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. తన పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, నాలుగు రోజులు నుంచి తాను ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే కాపలా కాస్తున్నట్లు తెలిపారు. గతంలో తనను పోలీస్ స్టేషన్‌లో కూర్చోపెట్టి తన భూమిలో బలవంతంగా సచివాలయం గోడ కట్టారని మీరా ప్రసాద్ వెల్లడించారు.
కాగా తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్‌డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరా ప్రసాద్ అనే రైతు తన భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, ఆ నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే విషయంపై నాలుగు రోజుల క్రితం తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు మీరా ప్రసాద్‌ను పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకుని, బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మీరా ప్రసాద్ సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment