మిరుదొడ్డి (దుబ్బాక): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందెలో రూ.1.6 కోట్ల నిధులతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏదో ఒక మూలన రైతుల ఆత్మహత్యలు జరిగేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంటే తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని అన్నారు.
తెలంగాణలో ఉన్న రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్, వారికి బీమాతో భరోసా, పంటలకు మార్కెటింగ్ సౌకర్యం, గోడౌన్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర, పెట్టుబడి సాయంతో పాటు ప్రాజెక్టులతో సాగు నీరు అందిస్తున్నారని వివరించారు. ఖరీఫ్‌లో పంట సాయం అందించిన మాదిరిగానే రబీ సీజన్‌లో సైతం ఎకరానికి రూ.4వేలు అందించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోందన్నారు.
పాలమూరు ఎత్తిపోతలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, దిండి ప్రాజెక్టు నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందన్నారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలోగా పూర్తయితే తెలంగాణలో ఉన్న కోటి ఎకరాల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక రైతుల కాళ్లను తడుపుతామన్నారు. రైతులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే పంటలకు తగినంత సాగు నీరు లభిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, దేశం కలిస్తే ఒరిగేదేమీ లేదు
‘సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే బలం, ప్రజలే దేవుళ్లు, ప్రజల సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తాం’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాబలం లేని కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం, సీపీఎంలు ఒక్కటవుతాయట.. అంటూ ఎద్దేవా చేశారు. వీరు కలిస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు.., ఉత్త కరెంటే ఇచ్చింది’అని విమర్శించారు.
వారి హయాంలో గంటకోసారి కరెంటు ట్రిప్పు, పంటకోసారి మోటార్లు కాలిపోయాయన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నాణ్యమైన కరెంటును ఉచితంగా అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కరెంటు లేకున్నా, మోటార్లు కాలిపోయినా కాళేశ్వరం నీటితో పొలాలు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, కరెంటు కోత, విత్తనాల కొరత రైతులను పట్టి పీడించాయన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు కోసం తమ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు.
విద్యకు పెద్ద పీట..
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 570 ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతీ మండలానికి బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment