పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న గురివిరెడ్డి మృతదేహం
తొండూరు : తొండూరు మండల పరిధిలోని బోడివారిపల్లె గ్రామానికి చెందిన మార్తల గురివిరెడ్డి(48) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురివిరెడ్డి వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య గుర్రమ్మ, కుమారుడు వెంకట్రామిరెడ్డి, తల్లి బాలమ్మలు ఉన్నారు. బోడివారిపల్లె గ్రామంలో తన తల్లి బాలమ్మ పేరుమీద 2.50ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో రెండేళ్ల క్రితం బోరు వేశాడు. అప్పట్లో బోర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మోటారు కోసం దాదాపు రూ.2లక్షల దాకా అప్పు చేశాడు. ఏడాదైన తర్వాత ఉన్న బోరుబావిలో నీరు రాకపోవడంతో ఏడాది క్రితం మరోచోట బోరు వేశాడు. అందులో నీరు పుష్కలంగా పడటంతో మరింత అప్పు చేసి వ్యవసాయ పంటలు సాగు చేశాడు.
సాగు చేసిన పంటలు అంతంత మాత్రంగా దిగుబడి రావడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పుకు వడ్డీ కలుపుకుని దాదాపు రూ.6లక్షలకు చేరుకుంది. తల్లి బాలమ్మ, గురివిరెడ్డిలు కలిసి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. అప్పులు రోజు రోజుకు పెరుగుతుండటంతో నిరాశకు గురయ్యాడు. దీంతో తన తల్లి బాలమ్మ పేరుతో 2014లో బ్యాంక్‌లో రూ.40వేల రుణం ఉండటంతో ఒకేసారి రూ.40వేలు రుణమాఫీ అయ్యింది. ఈ ఏడాది తిరిగి మల్లేల ఏపీజీబీలో 19180045480 అనే అకౌంట్ నెంబర్‌లో రూ.66వేలు పత్తి పంట సాగు కోసం తన తల్లి పేరు మీద అప్పు చేశాడు.
ఐదేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, అప్పులు తీర్చలేక అష్టకష్టాలు పడ్డాడు. రూ.6లక్షలకు చేరిన అప్పులు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ.. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తారేమోనని మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి అందరూ కలిసి ఆరు బయట పడుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో వంకాయ పంట కోసం తెచ్చిన పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గురివిరెడ్డి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ
బోడివారిపల్లెకు చెందిన రైతు గురివిరెడ్డి మృతదేహం పులివెందుల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో ఉండటంతో తొండూరు ఎస్‌ఐ వెంకటనాయుడు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. విషయంతెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, సర్పంచ్ గురుమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రాజశేఖరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామనాథరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment