గుంటూరు జెడ్పీ గ్రీవెన్స్‌లో మీ కోసం కార్యక్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంటున్న ప్రసన్న బాబు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు, టీడీపీ నేతల తీరుతో విసిగి వేసారిన ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కలెక్టరేట్ల ఆవరణల్లోనే కిరోసిన్, పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకోబోయారు. ఇక పత్తికి గిట్టుబాటు ధరల్లేక, అప్పులు తీరేదారి కనిపించక అనంతపురం జిల్లాలో నరసింహులు పురుగు మందు తాగి తనువు చాలించాడు.
డిగ్రీ చదివి వ్యవసాయం: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురానికి చెందిన మాడా శివ ప్రసన్న బాబు డిగ్రీ వరకూ చదివాడు. గత పదేళ్లుగా తనకున్న రెండెకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో అరకొర పంట చేతికందుతుండటం.. గిట్టుబాటు ధరల్లేక రూ.8లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దీంతో సాగు మానేసి.. డెయిరీ పెట్టుకోవాలనుకున్నాడు. రుణం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. వారు పట్టించుకోకపోవడంతో.. 4 నెలల కిందట సీఎం చంద్రబాబును కలిశాడు. ఆయన స్పందిస్తూ డెయిరీ పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయిస్తానని, రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వడంతో.. ప్రసన్నబాబు మళ్లీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. సోమవారం జెడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జేసీ క్రితికా శుక్లాకు వినతిపత్రం అందించాడు. ఆ వెంటనే పెట్రోల్ బాటిల్ బయటకు తీసి శరీరంపై పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన సిబ్బంది ప్రసన్నను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కలెక్టర్ కోన శశిధర్ ప్రసన్నను మళ్లీ లోపలికి పిలిపించుకొని మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు చెప్పాడు. కలెక్టర్ వెంటనే నాబార్డు ద్వారా ఐదు గేదెలు కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేయాలని ఆదేశించారు.
పాసు పుస్తకం కోసం: చిత్తూరు జిల్లా వీకోట మండలం దొడ్డిపల్లెకు చెందిన ఉదయ్‌కుమార్ 15 ఏళ్లుగా 2.45 ఎకరాల డీకేటీ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. అనాథ యువతి వివాహానికి సాయం చేసినందుకు గానూ గ్రామస్తులు ఈ భూమిని ఉదయ్‌కుమార్‌కు గతంలో అప్పగించారు. ఈ భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు ఇప్పించాలని జన్మభూమి సభలో అధికారులను కోరాడు. అయితే ఆ భూమి లక్ష్మమ్మ అనే మహిళ పేరుతో ఉందని తెలపడంతో ఉదయ్‌కుమార్.. జిల్లా కలెక్టర్‌ను కలసి సమస్య పరిష్కరించాలని కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం ఆదేశాల మేరకు తహసీల్దార్ దొడ్డిపల్లె గ్రామానికి వెళ్లి విచారించగా.. ఆ భూమి ఉదయ్ ఆధీనంలోనే ఉందని తేలింది. తర్వాత కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఉదయ్ కుమార్ భార్య, పిల్లలతో కలసి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువకు చెందిన టంకాల మోహనరంగకు ఎకరాన్నర భూమి ఉంది. సాగు కోసం బోరు బావి వేయించుకునేందుకు విద్యుత్ కనెక్షన్ కావాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కూర్మారావు అడ్డుపడుతున్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తున్న కూర్మారావు కన్ను మోహనరంగకు చెందిన భూమిపై పడింది. అది తనకు రాసివ్వాలంటూ మోహనరంగపై ఒత్తిడి చేస్తున్నాడు. మోహనరంగ ససేమిరా అనడంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన మోహనరంగ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి.. శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment