వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు లక్ష్యం | 15 per cent growth target for next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు లక్ష్యం

Published Sun, Nov 29 2015 3:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు లక్ష్యం - Sakshi

వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు లక్ష్యం

♦ అభివృద్ధిపై మూణ్నెళ్లకోసారి మలేసియా తరహాలో సమీక్షకు ల్యాబ్‌లు ఏర్పాటు
♦ మేధోమథనంలో అధికారులకు సీఎం చంద్రబాబు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో పనితీరు సూచికలు ప్రామాణికంగా మూణ్నెళ్లకు ఓసారి అభివృద్ధిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 2014-15లో 7.48 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2015-16లో వృద్ధిరేటు లక్ష్యాన్ని 10.83 శాతంగా నిర్దేశించుకున్నాం. తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో ఉండటం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. 2016-17లో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు  మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 88 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం హైదరాబాద్‌లోని సచివాలయానికి ఆయన వచ్చారు. సచివాలయంలోని ఎల్-బ్లాక్ సమావేశ మందిరంలో మంత్రులు, ప్రభుత్వ విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులతో మేధోమథనం నిర్వహించారు.

సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘‘రాజధాని నిర్మాణం మనకు లభించిన అరుదైన అవకాశం. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, భారీగా రహదారులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. నిరంతర విద్యుత్ సరఫరాలో దేశంలో అగ్రగామిగా ఉన్నాం.  ఈ నేపథ్యంలో ఆశించిన వృద్ధిరేటు సాధించడం అసాధ్యం కాదు’’ అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు  నిధుల్ని ఖర్చు చేస్తున్నా.. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 త్వరలో మలేసియా విధానం అమలు
 రాష్ట్రం అన్నిరంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాల్సిన అవసరముంటుందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మలేసియా ల్యాబ్ విధానం అనుసరణీయమన్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ విభాగాలను పెట్టుకుని.. ప్రతి త్రైమాసికానికి పనితీరుపై సమీక్షించే విధానం మలేసియాలో సత్ఫలితాలనిచ్చిందని.. రాష్ట్రంలో అదేతరహా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

 భూగర్భజలాలు అందకనే సీమలో రైతు ఆత్మహత్యలు..
 ఇటీవల కురిసిన వర్షాలవల్ల రాష్ట్రంలో భూగర్భజలాలు పెంపొందాయని, ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊహించనివిధంగా భూగర్భ జలమట్టం పెరిగిందని సీఎం తెలిపారు. రాయలసీమ రైతులు భూగర్భజలాలు అందకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విశ్లేషించారు. నెల్లూరుజిల్లాలో ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ కట్టడాలవల్లే వరదలు వచ్చాయన్నారు. కాగా ఐదువేల గ్రామాల్లో కరువును పారదోలడానికి ‘పంట సంజీవని’ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం చెప్పారు. ‘ఉపాధి హామీ’ పథకం నిధుల్లో 60 శాతం నిధుల్ని నీరు-చెట్టు పథకానికే ఖర్చుచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,50,320 మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారని, ఇందులో విశాఖ ముందంజలో ఉందని చెప్పారు.
 
 హైదరాబాద్‌లోనూ సమావేశాలు పెట్టండి: గంటా సూచన
 
 ఆ ఆలోచన లేదన్న చంద్రబాబు
 ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్‌కూ పదేళ్లపాటు హక్కున్న నేపథ్యంలో వారం, పదిరోజులకోమారు ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎంకు సూచించారు. శనివారం సచివాలయంలో రెండంకెల అభివృద్ధిపై జరిగిన శాఖాధిపతుల సమావేశంలో గంటా ఈ సూచన చేయగా.. చంద్రబాబు ఆ ఆలోచనేది లేదన్నారు. ఇపుడిపుడే విజయవాడ నుంచి సాగుతున్న ఏపీ పరిపాలన గాడిన పడుతోందని, ప్రజల్లోనూ కొంత నమ్మకం ఏర్పడుతోందని, ఈ సమయంలో వారానికి, పదిరోజులకు ఒకమారు హైదరాబాద్‌లో సమావేశాలు జరిపే ఆలోచన లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. తాను ముఖ్యమైన సమావేశాలు ఇకనుంచి విజయవాడలోనే నిర్వహిస్తానని సీఎం చెప్పారు.

 బాబు హైదరాబాద్‌లో ఉండాలని నేతలు కోరుకుంటున్నారు: అచ్చెన్న
 సమావేశానంతరం కార్మికమంత్రి కె.అచ్చెన్నాయుడు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంతోపాటు రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలు తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు వారానికి రెండు, మూడురోజులు హైదరాబాద్‌లో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. త్వరలో తెలంగాణలో స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు వారాంతంలో హైదరాబాద్‌లో ఉండాల్సి రావచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement