
‘నాకెంత దాహమేసిందో నా మొక్కలకూ అంతే దప్పిక కదా. నాకు నా వాళ్లు నీళ్లిచ్చారు. మరి వాటికి నేనే కదా వాళ్ల వాడిని. మబ్బును వంచి, మొయిలును తుంచి, మొక్క మొక్క మీదా పిండి నీళ్లు కురిపించాలని ఉంటుంది నాకు. అది కుదిరేపని కాదు కదా’ అంటాడు రైతు.
అప్పటి వరకూ ఎండలో తిరిగి తిరిగి అప్పుడే ఇంటికి చేరాడాయన. కాసిన్ని నీళ్లవ్వమంటే ఆలి కుండలోంచి మంచినీళ్లిచ్చింది. చల్లటి ఆ నీళ్లు హాయిగా గొంతు దిగుతున్నాయి. కాసేపు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నవాడు కాస్తా గబుక్కున లేచాడు. చివరి నీటి గుక్క గొంతుదాటేలోపు ఆయన అడుగు గడప దాటింది. వసారాన కావడి భుజం చేరింది. ఇంటి దగ్గరి తొలి అడుగు పొలం వైపునకు పరుగయ్యింది.
‘‘చల్లటి నీళ్లు గొంతు తడుపుతుంటే... ఆ హాయి నీ మనసు తడుముతుంటే... అనుభవిస్తూ కూర్చోక అంత వేగంతో ఎందుకు కదిలావూ...?’’ అడిగింది మనస్సాక్షి. ‘‘నేనంత హాయిని అనుభవించా కదా. మరి నా బిడ్డలక్కడ నీళ్లు లేక ఎప్పట్నుంచి ఎండుతున్నాయో! మరి వాటికీ ఆ హాయి వద్దా?’’ అంటూ ఎదురుప్రశ్నించాడాయన. ఎవరయ్యా ఆయన... అవును... రైతయా ఆయన.
‘‘పొలంలో మొక్క పదిలంగానే ఉంటుందిలే. వానేమో పడలేదు. రేపైనా పడుతుందేమోలే. కాసేపు నీడపట్టున కూర్చోకపోయావా?’’ మళ్లీ అడిగింది మనస్సాక్షి.
‘‘నాకెంత దాహమేసిందో నా మొక్కలకూ అంతే దప్పిక కదా. నాకు నా వాళ్లు నీళ్లిచ్చారు. మరి వాటికి నేనే కదా వాళ్ల వాడిని. మబ్బును వంచి, మొయిలును తుంచి, మొక్క మొక్క మీదా పిండి నీళ్లు కురిపించాలని ఉంటుంది నాకు. అది కుదిరేపని కాదు కదా. అందుకే ఇలా బయల్దేరా’’ మనస్సాక్షికి సమాధానమిచ్చాడు రైతు.
అవును... రైతంటే అంతేమరి. సాధ్యం కానివీ, చేయాలనుకునేవాటినీ చేయాలనుకునేవాడే సేద్యగాడు మరి. చిన్నప్పుడు అందరూ ప్రకృతి వికృతి చదువుకున్నారు కదా. సాధ్యగాడు అనే మాట ప్రకృతి అయితే దాని వికృతి రూపమే సేద్యగాడేమో!? తల్లీ బిడ్డల్ని చూసుకున్నట్టుగానే చేను–మొక్కల్ని తాను చూస్తాడు. అరకపట్టీ మెరకదున్నీ చదునుచేసీ నాట్లు వేసి మొక్క మొలిచీ మొలవగానే... పసిబిడ్డలా దాన్ని పట్టుబట్టి సాకుతాడు. గిట్టుబాటు అవుతుందా లేదా అని కూడా లెక్క చూడడు. బిడ్డల ఖర్చును ఎవడైనా లెక్క చూస్తాడా? హాలికుడూ అంతే... నిజానికి రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదు.
దాన్ని చేయించడమూ కుదరదు. పొలం ఏండిన ఏడూ... చేను పండని ఏడు పాట్లెక్కువ. అరకొర పండినా మార్కెట్లో అగచాట్లెక్కువ. పండించాక కూడా దళారీ జేబులోని నోట్లూ ఎక్కువ. కానీ... తనకు మాత్రం గిట్టుబాటు తక్కువ. అయినా సరే... రైతు లెక్క చూడడు. అలాంటి వాడు లెక్క చూడటం మొదలు పెట్టి మొక్క మొక్కకూ లెక్కవేసి, గిట్టుబాటు కాదంటూ కాస్తా పాడుబడితే... చేను కాస్తా బీడుపడతది. రైతు క్షేమమే కదా రాజ్య క్షేమం. రైతు భాగ్యమే కదా రాజ్య భాగ్యం. అప్పుడు రైతు గోసపడితే రాజూ గోసపడాల్సి వస్తుంది. ఎందుకంటే... రాజనాలు పండించే వాడే పస్తుంటే పరమాత్మకూ పస్తే అంటారు. ఇక ఆ తర్వాత రాజనగా ఎంత... మహారాజనగా ఎంత!
అందుకే వాడు తాను చెడ్డా చేను చెడనివ్వడు. పొలం పొత్తిళ్లలోని మొక్కల చాళ్లలో నీళ్లు కావిళ్లతో పోసి, ప్రతి మొక్క మొదళ్లలోనూ అంతో ఇంతో తడి ఉండేలా చేసి, మర్నాడు మధ్యాహ్నం ఎండపూటన వచ్చి... మట్టిలో వేళ్లు గుచ్చి... తడి ఇంకా ఉందా... నేల పొడిబారిందా అంటూ మాటిమాటికీ చూసుకుంటాడు. ఒకరిద్దరు బిడ్డలున్న తల్లి పని కాస్త సులువు. కానీ పొలంలో ప్రతి మొక్కా రైతుకు బిడ్డేగా. అందుకే మొక్క మొక్కకూ ఆ హలజీవి కావిడి నీళ్లతో పెట్టే తడి ముద్దుతోనేనేమో... రైతులోని ఆ అమ్మదనం – మన కంచంలో కమ్మదనంగా మారి నోటికి ఇంత ముద్దగా రుచిగా అందుతోంది.
అందుకే కాలం కాకున్నా... పొలం పండకున్నా... ఏటికేడాది నష్టం వస్తున్నా లాభం లేకున్నా చీడ ఆశించినా... పీడ పట్టేసినా వదలకుండా చేనుకాపలాదారు కనిపెట్టుకొని ఉంటూ ఆలా సేద్యాన్ని చేస్తూనే ఉంటాడా వ్యవసాయదారు. ‘ఎందుకయా ఇంత బాధ’ అంటూ మనస్సాక్షి ఆ కమతగాణ్ణి అడిగితే ఆయనంటాడూ... ‘చేనుకి గట్టూ... ఊరికి కట్టూ’ ఉండాలేమోగానీ ‘రైతుకు బెట్టు ఎందుకయా... పొలం బెట్టగొట్టుకుపోయినా రైతు వ్యవసాయం మానొద్దు. ఎందుకంటే చేను చేసి ఎవడూ చెడిందీ లేదూ... చెడు చేసి ఎవడూ బతికిందీ లేదు’ అంటూ ఏటికేటికి నష్టాలు వస్తున్నా మాటిమాటికి అదే సమాధానమిస్తుంటాడు. ‘నేను సాగు చేస్తే పెంట కూడా పంటవుతుంది. నేను గడ్డి వేస్తే అదే ఊళ్లో పాడి అవుతుంది. పదిమందికీ ఆఖరికి పరమాత్మకూ పరమాన్నం పెట్టేవాడిని నేనే. అలాంటి నేను కాడి దించేస్తే ఎలా?’’ అందుకే మనం ముద్ద ముద్దకూ ఆయన్నే కొలవాలి. ముద్ద తినేముందర ఆయన్నే తలవాలి. ఇకపై మన ప్రతి పనీ ఒకటే మాటను గుర్తుపెట్టుకొని చేయాలి.
అదేమిటంటే...
చేలు పండాలి. రైతు గుండె నిండాలి. ఊరు నిబ్బరంగా, నిశ్చింతగా, నిర్భయంగా ఉండాలి. లోకం సుక్షేమంగా నిక్షేపంగా సుభిక్షంగా ఉండి తీరాలి.
– యాసీన్