
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లయగూడెం, పోతునువు, రాఘవాపురం, పరిసర ప్రాంతాల్లో వరదల కారణంగా నాట్లు వేసిన పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చింతకపూడిలోని పలు రహదారులు, గ్రామాలను కలిపే రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నివాస ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ముఖ్యంగా చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపునీరు వచ్చిచేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలోకి వరదనీరు వచ్చిచేరింది. దీంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విస్తారంగా వర్షాలు..
జిల్లాలోని దెందులూరు, ఉంగుటూరు, గణపవరం, అత్తిలి, తణుకు, ఉండి, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. నాట్లు ఆలస్యంగా ప్రారంభమవ్వడం.. ఇంతలోనే వర్షాలు రావడంతో చాలా ప్రాంతాల్లో నారుమళ్లు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగిపోయినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఎకరానికి 3 వేల రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా వర్షాలకు జిల్లాలో రూ. 6 కోట్ల వరకు పంట నష్టం
వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. నారుమళ్లు నీటమునగడంతో మళ్లీ విత్తనాలు కొనేందుకు ఎకరానికి మూడు వేల రూపాయిల వరకు పెట్డుబడి పెట్టాల్సి ఉందని రైతులు
ఆవేదనకు లోనవుతున్నారు. గత నాలుగు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆక్వా రైతు ఆందోళన నెలకొంది. తాజా వాతావరణ మార్పులతో రొయ్యల చెరువులకు తీవ్రంగా నష్టంగా వాటిల్లుతోందని, ప్రధానంగా ఆక్సీజన్ అందక రొయ్యలు చెరువుల్లోనే చనిపోతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment