భారీ వర్షాల నష్టం నుంచి తేరుకోని జిల్లా | Heavy Losses to prakasam Farmers Due to Heavy Rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల నష్టం నుంచి తేరుకోని జిల్లా

Published Thu, Oct 31 2013 6:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Heavy Losses to prakasam Farmers Due to Heavy Rains

సాక్షి, ఒంగోలు: జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి పూర్తిగా తగ్గినా..వాటి తాకిడికి గురైన ప్రజలు ఇంకా కోలుకోలేదు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పరిహారం ఇవ్వడం విషయం అలా ఉంచితే..కనీసం నష్టం అంచనాలు వేయడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పొలాల్లో ఉన్న నీరంతా తొలగిపోతే తప్ప తాము ఒక అంచనాకు రాలేమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ అంతా..తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందిస్తామని, రైతులకు అండగా ఉంటామని చెప్పినా...ఆ హామీలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.  
 
 జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే సరికి మరో 15 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున చెరువులు, వాగులకు పడిన గండ్లు ఇంకా పూడ్చలేదు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పత్తి, వరి, వేరుశనగ పంటలు  నీట మునిగాయి. గిద్దలూరు, కొమరోలు మండలాల్లో పత్తి, మిరప, కంది, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పంటపొలాల నుంచి ఇంకా నీరు బయటకు పోలేదు. ఒంగోలు నగరంతో పాటు, తీర ప్రాంత గ్రామాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచి ఉంది. కొత్తపట్నం మండలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలు నీటితో నిండిపోయి కనుచూపుమేరా చెరువులను తలపించేలా ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడం సాధారణమైనా..ఈసారి మాత్రం ఎగువ ప్రాంతాలైన గిద్దలూరు, కొమరోలు వంటి మండలాలు సైతం పూర్తిస్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు వరద రూపంలో ఈ మండలాలను ముంచెత్తింది.
 
 కుదేలైన ఆక్వా రంగం
 జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో సుమారు 15 వేల హెక్టార్లకు పైగా వెనామీ రొయ్యల సాగు జరుగుతోంది. వరదల కారణంగా రొయ్యల చెరువుల్లోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడంతో రోజుల వయసున్న పిల్లలతోపాటు రేపోమాపో హార్వెస్టింగ్‌కు సిద్ధంగా ఉన్న రొయ్యలు సైతం కొట్టుకుపోయి  రైతులు కుప్పకూలిపోయారు. లక్షలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి రొయ్యల సాగుకు పెట్టుబడి పెట్టగా అది కాస్తా నేలపాలైందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అగమ్యగోచరంగా కౌలు రైతులు: జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతన్నలు ముఖ్యంగా కౌలు రైతులు భారీగా నష్టపోయారు. అనేక మంది కౌలు రైతులు జీవన్మరణ పరిస్థితులు ఎదుర్కొంటుండగా మార్టూరు మండలం ఇసుకదర్శి గ్రామానికి చెందిన షేక్ మౌలాలి (49) అనే కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు. సుమారు రూ. 3 లక్షల వరకు వడ్డీకి తెచ్చి పంట సాగు చేసిన మౌలాలి వాటిని తీర్చేదెలాగ ? అనే ఆలోచనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని అతని కుటుంబం రోడ్డున పడింది.  
 
  ఊహించని వరద ఉధృతికి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది కొట్టుకుపోయారు. వారిలో గిద్దలూరు, కొమరోలు ప్రాంతాల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఐదుగురున్నారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద రూ. 1.50 లక్షలు అందజేసి చేతులు దులుపుకుంది.   
 వర్షాల వల్ల జిల్లా రైతాంగం, ప్రజలు అనేక విధాలుగా నష్టపోయినా ప్రభుత్వం మాత్రం కేవలం 10 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ ఇచ్చి సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి  జిల్లా పర్యటనలో  5 రోజులపాటు నీట మునిగి ఉన్న కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలకు 20 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారు. కేవలం ఈ బియ్యం తమ కంట నీరు తుడవగలదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరదల వల్ల ఒంగోలు పట్టణంలో 26 కాలనీలు నీట మునగ్గా, జిల్లా వ్యాప్తంగా 65 కాలనీల వరకు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఒక దశలో కాలువలు, పొలాలు కలిసిపోయి ఏవి కాలువలో, ఏవి పొలాలో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాలకు సంబంధించి రూ. 586 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు  ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వాస్తవానికి ఈ నష్టం అంతకు మూడు రెట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు.
 
 నేతన్నా... నీకు దిక్కెవరన్నా?
 వర్షాల వల్ల చేనేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంతోపాటు, ఒంగోలు, జె.పంగులూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడుల్లో పెద్ద ఎత్తున ఉన్న చేనేత కార్మికుల ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో మగ్గం గుంతలన్నీ నీటితో మునిగిపోయి అవి ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి. ఒక్క చీరాలలో 12 వేలకు పైగా మగ్గాలు నీట మునిగాయి. ఐఏవై పథకం కింద గృహనిర్మాణానికి రూ. 70 వేలు, అదనంగా మరో రూ. 15 వేలు అందజేస్తామని, నీట మునిగిన మగ్గాలకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే కనీసం రూ. 20 వేలు నష్టపరిహారం అందించనిదే తమ పరిస్థితి ఒక గాడిన పడదని చేనేత కార్మికులు వాపోతున్నారు.
 జిల్లాకు జరిగిన తీరని నష్టాన్ని కొంతమేరకైనా తీర్చే విషయంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగం, చేనేత కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement