న్యూస్‌లైన్, నెట్‌వర్క్: వెలుగులు నింపాల్సిన దీపావళి వారి ఇళ్లలో విషాదం నింపింది. ఇటీవలి భారీ వర్షాలు వారిని తీవ్రంగా కుంగదీశాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ముంపునకు గురై కోలుకోలేని దెబ్బతీశాయి. అప్పులు తీరేదారి లేక పండగపూట.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా తూర్పుగోదావరి ఒకరు మనస్తాపంతో తనువు చాలించారు. మరొకరు ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా మైసంబావి గ్రామానికి చెందిన గూడూరు పద్మారెడ్డి (48) రూ.5 లక్షలు అప్పు చేసి, తన ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. భారీ వర్షాలకు పంటంతా నాశనమైంది. దీంతో ఆవేదనకు గురై శుక్రవారం పత్తి చేనులోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడు మండలం వెల్మకన్నెకు చెందిన భీమనపల్లి రాములు (37) తన రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. రూ. 80 వేలు అప్పు చేసిన పత్తి వర్షాలకు నాశనమవ్వడంతో తట్టుకోలేక శుక్రవారం పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం మరణించాడు. ఆదిలాబాద్ జిల్లా సాలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ (35) అప్పు చేసి పత్తి సాగు చేయగా.. వర్షాలకు చేనులో కలుపు పెరిగింది.
దిగులుతో శనివారం పురుగు మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. వరంగల్ జిల్లా చుంచనకోట గ్రామానికి చెందిన బింగి సాయిలు(40) తన నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. భారీ వర్షాలకు పత్తి నేలపాలైంది. చేసిన అప్పులు తీర్చడం కష్టమవుతుందనే మనస్తాపంతో ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఎన్నారం గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(38) ఐదెకరాల్లో పత్తి, మొక్కజొన్న వేశాడు. గతంలో చేసిన అప్పు, ప్రస్తుత పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు మొత్తం రూ.4 లక్షలకు చేరుకుంది. వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. మొక్కజొన్న కూడా చేతికందలేదు. దీంతో కలత చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. తూర్పుగోదావరి జిల్లా కుతుకుడుమిల్లి శివారు పెదకలవలదొడ్డికి చెందిన నురుకుర్తి సత్యనారాయణ(55) అయిదెకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునగడాన్ని తట్టుకోలేక కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురై శనివారం నిద్రలోనే మరణించాడు. కాగా, పంట ముంపునకు గురైందనే మనస్తాపంతో కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన కౌలు రైతు బుద్ద శివ(45) శనివారం గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఐదుగురు రైతుల బలవన్మరణం
Published Mon, Nov 4 2013 2:04 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement