
మేడిపల్లి (వేములవాడ): భూమి తన పేరు మీద పట్టా కాదేమోననే బెంగతో బుధవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన ఎస్.మల్లేశం(45)కు వల్లంపల్లి శివారులో 325 సర్వే నంబర్‌లో 3.38 ఎకరాల భూమి ఉంది. అది ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో 2015లో ఇక్కడ పనిచేసిన వీఆర్‌వోను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన తన భూమిని పట్టా చేయకుండా మోసం చేశాడని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని వాపోయేవాడు. తన భూమి ఇతరుల పేరిట అవుతుందేమోనని మనస్తాపానికి గురై.. బుధవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మల్లేశం పేరిట భూమి ఉంది: కలెక్టర్
జగిత్యాల అగ్రికల్చర్: రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకనే మల్లేశం ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని జగిత్యాల కలెక్టర్ శరత్ చెప్పారు. మల్లేశంకు 7.16 ఎకరాలు, ఆయన పెద్ద కొడుకు మధు పేరిట 2.8 ఎకరాలు, చిన్న కొడుకు గణేశ్ పేరిట 2.10 ఎకరాలు భూమి ఉందన్నారు. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని.. పాసుపుస్తకాలు వచ్చాయని తెలిపారు. రైతుబంధు పథకం కింద మల్లేశంకు రూ.29,600, మధుకు రూ.8,850, గణేష్‌కు రూ.9,050 సంబంధించిన చెక్కులు సైతం వచ్చాయని వివరించారు. మల్లేశం మృతిపై పోలీసులు విచారణ చేపడుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment