రాప్తాడు: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన రైతు హనుమంతు నాయక్ (67)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. నాలుగైదేళ్లుగా వేరుశనగ సాగుచేసినా పంట చేతికందలేదు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుల వివాహాల కోసం బయటి వ్యక్తులతో అప్పులు చేశాడు. ఇటీవల పొలంలో నాలుగు బోర్లు వేయించి అరకొర నీటితోనే టమాట, బెండ, అనుము పంటలు సాగు చేసినా ఆశించినస్థాయిలో దిగుబడులు రాలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని మరో బోరు వేయించినా నీరు పడలేదు. ఈ క్రమంలో అప్పులు రూ.8లక్షలకు చేరుకున్నాయి.
పెరిగిన రుణదాతల ఒత్తిళ్లు
వరుస పంట నష్టాలతో కుదేలైన హనుమంతునాయక్‌కు రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. శనివారం రాత్రి కూడా రుణదాతలు ఇంటి దగ్గరకు వచ్చి అప్పు తీర్చాలని పట్టుబట్టారు. నాలుగైదు రోజుల్లో అప్పు తీర్చేస్తానని చెప్పి వారిని పంపించేశాడు. మానసిక వేదనకు గురైన రైతు ఆ పూట అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు.
అప్పులపై చర్చిస్తూ కుప్పకూలిపోయాడు
వ్యవసాయం కలసిరాకపోవడం, అప్పులు పెరిగిపోవడంపై భార్య దస్లీబాయితో హనుమంతునాయక్ ఆదివారం మధ్యాహ్నం చర్చించాడు. తర్వాత భోజనం తినకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామస్తులతో అప్పుల విషయమై చర్చిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు.
రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
అప్పులబాధ తట్టుకోలేక గుండెపోటుకు గురై రైతు హనుమంతునాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాలవాయి గ్రామాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుణదాతల నుండి ఒత్తిళ్లు అధికం కావడంతోనే హనుమంతు నాయక్ మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్య నారాయణరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, పోతన్న, పాలవాయి పుల్లయ్య, మురళినాయక్, గొవింద నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment