
మఠంపల్లి (హుజూర్‌నగర్)/కొడంగల్ రూరల్/తొగుట(దుబ్బాక): అప్పులబాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భోజ్యాతండాకు చెందిన అజ్మీరా బాలు (40) సాగు పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు.
దిగుబడులు ఆశాజనకంగా లేక అప్పు తీర్చే మార్గం కనిపించక శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పెద్దనందిగామకి చెందిన వెంకటయ్య(45) బోర్లు పడక పోవడం, పంటల దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. మనస్తాపం చెందిన వెంకటయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు.
సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్‌పల్లికి చెందిన దుద్దెడ మల్లేశంగౌడ్ (35) వర్షాల్లేక మొక్కజొన్న పంట దెబ్బతింది. రూ.5 లక్షల అప్పు అయింది. దీంతో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.